రూ.30 లక్షలకు లెక్కల్లేవు
విజయవాడ కల్చరల్:
డూండీ గణేష్ సేవా సమితిలో విభేదాలు భగ్గుమన్నాయి. గతేడాది ఉత్సవాల పేరుతో రూ.1కోటి పది లక్షలు వసూలు కాగా అందులో రూ.30 లక్షలు పక్కదారి పట్టాయంటూ సేవా సమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం ఆరోపించారు. బుధవారం సంగీత కళాశాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సేవాసమితి తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. గత సంవత్సరం నిర్మించిన భారీ వినాయక విగ్రహం జమాఖర్చుల విషయంలో ఆవకతవకలు జరిగాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. చందాల వసూళ్ల నుంచి విగ్రహనిర్మాణం, లడ్డూప్రసాదాలు, నిర్వహణ వరకు అన్నింటా భారీఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తూ లెక్కలు అడుగుతుంటే నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. తాజా పరిణామాలు సేవా సమితి పేరుతో జరిగిన దోపిడీని బహిర్గతం చేస్తోందనే వ్యాఖ్యలు బలం పుంజుకున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ కోగంటి ఆధిపత్య పోరు
సంగీత కళాశాల కళావేదికపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే, కోగంటి సత్యం మధ్య పోరుసాగుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో సత్యంను దెబ్బతీసేందుకు సేవా సమితిలో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని రంగంలోకి దించారు. ఆరుగురికి స్థానం కల్పించారు. దీనిపై సత్యం గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అక్రమాలను గుట్టు రట్టు చేయడం ద్వారా ఇటు సేవాసమితికి అటు ఎమ్మెల్యేకు చెక్ పెట్టొచ్చన్నది సత్యం ఎత్తుగడగా తెలుస్తోంది. సత్యంను కమిటీ నుంచి సాగనంపేందుకు ఎమ్మెల్యే వర్గం కుయుక్తులు పన్నుతోంది. సత్యంకు ఎలాంటి సమాచారం లేకుండానే కొందరు సభ్యులు తరచూ విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ దఫా చవితి
విజయవంతమయ్యేనా
ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో డూండీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఏడాది గణపతి నవరాత్రుల వేడుక సజావుగా సాగేనా అన్న సందేహాలు భక్తులకు కలుగుతున్నాయి. గతేడాది నిర్వహించిన ఉత్సవాలకు అనూహ్య స్పందనవచ్చింది. కీచులాటల క్రమంలో సమితి ప్రతిష్ట రోడ్డున పడ్డట్లైంది. భక్తి ముసుగులో సేవా సమితి సభ్యులు కొందరు చేస్తున్న ఆగడాలపై భక్తులు చీదరించుకుంటున్నారు. గతేడాది ఉత్సవాలకు సంబంధించి జమాఖర్చుల్ని బయటపెట్టి నిజాయితీని నిరూపించుకోవాలని కోరుతున్నారు.