Koilsagar
-
దర్జాగా ఇసుక దందా
సాక్షి, మరికల్: అక్రమ ఇసుక వ్యాపారులు అధికారుల అండదండలతో పాలమూరు ఇసుక రావాణాకు తుట్లు పొడుస్తున్నారు. వారి కన్నుసన్నల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. మండలంలోని పూసల్‌పహాడ్ సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ వాగులో జోరుగా అక్రమా ఇసుక రవాణా జరుగుతుంది. ట్రాక్టర్‌కు రూ.4500 నుంచి రూ.5వేల మధ్య ఇసుకను విక్రయిస్తుంటారు. పూసల్‌పహాడ్ గ్రామంలోని పలువురు వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అధికారులకు మామూళ్ల ముట్టచెబుతూ వారి దందాను దర్జాగా సాగిస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట పాడిదే పాటగా మారింది. పూసల్‌పహాడ్ నుంచి మరికల్, మాధ్వార్, తీలేర్, పల్లెగడ్డ, తధితర గ్రామాలకు ఇసుక ఆర్డర్లు వస్తే చాలు అధికారులకు ఫోన్ కొట్టిన తర్వాతనే వాగులోకి ఇసుక కోసం ట్రాక్టర్లను తీసుకెళ్తారు. వారు కాదంటే ట్రాక్టర్ ముందుకు కదలదు. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.3వేల చొప్పున అధికారులకు ఇస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపొవడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులు కోయిల్‌సాగర్ వాగు నుంచి గుట్టు చప్పుడుగా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకుంటే వారు ఎంతటికైనా తెగిస్తారు. అడ్డుకున్న వారు ఎవరని చూడకుండా దాడులు చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఏడాది క్రితం అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న వీఆర్ఓ మైబన్నను చితకబాది ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఇసుక వ్యాపారంలో ఉన్న లాభాలకు అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు ప్రస్తుతం కూడా వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అసలే వర్షాలు లేక బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపోతున్న తరుణంలో కోయిల్‌సాగర్ వాగుల్లో నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల వాగు పరివార ప్రాంతం సమీపంలో ఉన్న బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపొతుండటంతో ఇటీవల కొందరు రైతులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రైతులను సైతం విడిచిపెట్టకుండా దాడులు చేశారు. తమ పై దాడులు చేశారు కోయిల్‌సాగర్ వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులను అడ్డుకుంటే తమపై దాడులు చేసి గాయపర్చారు. తమ వ్యాపారానికి అడ్డు రావొద్దని భయపెట్టిస్తున్నారు. గ్రామంలో దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, రాంరెడ్డి, పూసల్‌పహాడ్ చర్యలు తీసుకుంటాం అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. పాలమూరు ఇసుక రవాణా కా కుండా దొడ్డిదారిన ఎవరైన సరే అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సహించం. అక్రమంగా ఇసుక తరలించేందుకే వీలులేదు. తప్పనిసరిగా అనుమతి పొందాల్సిందే. అధికారులచే తనిఖీలు చేపడుతాం. ఇసుక వ్యాపారులతో అధికారులు డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – నాగలక్ష్మి, తహసీల్దార్, మరికల్ -
లీకేజీల పర్వం.. తీరని దాహం
లీకేజీలకు నిలయంగా కోయిల్‌సాగర్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాకు ఇబ్బందులు నీటిఉధృతి తట్టుకోలేక పగిలిపోతున్న పైపులు మహబూబ్‌నగర్ రూరల్: పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే సంకల్పంతో ఏర్పాటుచేసిన కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తరచూ లీకేజీలకు గురవుతుండడంతో స్థానికులు నీటికోసం అనేక తంటాలు పడుతున్నారు. 2007లో పబ్లిక్‌హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ వారు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పైప్లైన్ల ఏర్పాటు విషయంలో, పనుల నిర్వాహణ విషయంలో మున్సిపల్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యమే పాలమూరు పట్టణ ప్రజలకు తరచూ తాగునీటి ఇబ్బందులను తెస్తుంది. కోయిల్‌సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఏర్పాటుచేసిన పైప్‌లైన్ నాణ్యవంతంగా లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ పైపులు లీకేజీలు అవుతున్నాయి. అందువల్ల కోయిల్‌సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టణంలో కేఎల్ఐ పథకం ద్వారా తాగునీటి సరఫరా అయ్యే ప్రాంతాలు ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. 15 రోజులకోసారి పైప్లైన్ల లీకేజీలు కోయిల్‌సాగర్ తాగునీటి పథకం కోసం ఏర్పాటుచేసిన పైపులు 15 రోజులకోమారు పగిలిపోతుండడంతో పట్టణ ప్రజలకు నీటి సమస్య ఎదురవుతుంది. పథకం ప్రారంభ సమయంలో నాణ్యమైన పైపులను ఏర్పాటు చేసింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పలు రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. అప్పట్లో సంబంధిత అధికారులు మాముళ్లకు కక్కుర్తిపడి పైపులు ఏ మేరకు నాణ్యతగా ఉన్నాయానే విషయాన్ని గమనించకుండా పైపుల బిగింపు పూర్తి చేయడంతో ఇప్పుడు అసలు సమస్య తలెత్తుతుంది. తరచూ పైపులు లీకేజీలు అవుతుండడంతో ప్రజలు సైతం విసిగెత్తుకుంటున్నారు. ఈ క్రమంలో వారంరోజుల క్రితం బండమీదిపల్లి సమీపంలో గల సరస్వతి శిశుమందిర్ పాఠశాల, ధర్మాపూర్ సమీపంలో జేపీఎన్సీ వద్ద మళ్లీ పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రజలు నీటి కోసం అల్లాడారు. మున్సిపల్ అధికారులు మాత్రం తీరికగా పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయిస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై మున్సిపల్ ఏఈ వెంకన్నను వివరణ కోరగా ‘కోయిల్‌సాగర్ పైప్‌లైన్ లీకేజీ అయిన మాట వాస్తవమే. నీటి ఉద్ధతిగా ఉన్నందున పైపులు లీకేజీలు అవుతున్నాయి. అయినా మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని’ చెప్పారు. -
నీటి విడుదలపై రైతుల అసంతృప్తి
తీలేర్ (ధన్వాడ) : కోయిల్‌సాగర్ కాల్వలు మరమ్మతుకు నోచుకోక చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని తీలేర్ గ్రామ రైతులు పటేల్ శ్రీనివాస్, రాంచంద్రయ్య, రాములు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం వారు శిథిలావస్థకు చేరిన కోయిల్‌సాగర్ కాల్వలను పరిశీలించారు. కాల్వలో మొలకెత్తిన ముళ్లచెట్లు, శిథిలావస్థకు చేరిన తూములతో సాగునీరు ముందుకు చేరని పరిస్థితి ఏర్పడిందన్నారు. పాత ఆయకట్టుకే దిక్కులేదు, కొత్తగా 8వేల ఎకరాలకు సాగునీరు ఎలా విడుదల చేస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీరు విడుదల చేసి పది రోజులు గడుస్తున్నా నేటికీ 16వ తూముకు చుక్కనీరు చేరలేదన్నారు. ఇష్టానుసారంగా కాల్వలను తెంపుకుంటూ పోతే పంటలకు నీరు ఎలా అందుతుందని మండిపడ్డారు. ఉపాధి కూలీల ద్వారా కోయిల్‌సాగర్ కాల్వలు, తూములకు మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సింహులు, రాములు, కుర్మన్న, సాయన్న, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కోయిల్‌సాగర్ కుడి కాల్వకు గండి
ధన్వాడ : కోయిల్‌సాగర్ ప్రధాన కుడి కాల్వకు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. దీంతో ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కేఎస్పీ ప్రధాన కుడి కాల్వకు గండి కొట్టడంతో నీరంతా ఊకచెట్టు వాగులో ప్రవహించింది. ఈ విషయమై వెంటనే రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తేరుకున్న ప్రాజెక్టు అధికారులు కుడి కాల్వ ద్వారా విడుదల అవుతున్న నీటిని ఆదివారం ఉదయం నిలిపివేశారు. ముమ్మరంగా వరినాట్లు వేసుకునే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వలో పెరిగిన ముళ్లచెట్లు, అధ్వానంగా మారిన తూముల వల్ల చివరి ఆయకట్టుకు చుక్కనీరు చేరకపోవడంతొ చివరి ఆయకట్టు రైతులు కాల్వకు గండి కొట్టినట్లు పై ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కుడి కాల్వకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కాల్వకు గండి పడిందని అధికారులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గోటూర్, పూసల్‌పహాడ్, తీలేర్ రైతులు కోరుతున్నారు. -
14 అడుగులకు కోయిల్‌సాగర్ నీటిమట్టం
14 అడుగులకు కోయిల్‌సాగర్ నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 14 అడుగులకు చేరుకుంది. రోజు రోజుకు నీటిమట్టం పెరుగుతుండడంతో రైతులు ఆనందలో మునిగి పోయారు. ఖరీఫ్ సీజన్లో పంటలు పండించు కోవచ్చని రైతులు భావిస్తున్నారు. గత నెల 21 వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన తరువాత జూరాల నుంచి కృష్ణా జలాలలను పంపింగ్ చేస్తున్నారు. మరో వైపు పెద్ద వాగు ద్వారా వరద జలాలు ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. రెండు వైపుల నుంచి వస్తున్న నీటిప్రవాహం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతూ వస్తున్నది. ఇంతకు ముందు ప్రాజెక్టులో 8 అడుగుల నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం మరో 6 అడుగులు పెరిగి 14 అడుగులకు చేరింది. ప్రాజెక్టు షెట్టర్ల లెవల్ వరకు 32.6 అడుగులుగా ఉండగా పాత అలుగు స్థాయి 27 అడుగులుగా ఉంది. మరో 13 అడుగుల నీరు చేరితే పాత అలుగు స్థాయికి నీటి మట్టం చేరుకుంటుంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్ పంటలు పండించే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. -
కోయిల్‌సాగర్ కెనాల్‌కు గండి
– నిలిచిన నీటిసరఫరా – యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నర్వ : భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా గత గురువారం కోయిల్‌సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసిన మూడోరోజే కోయిల్‌సాగర్ కాలువకు గండిపడింది. కోయిల్‌సాగర్ ఫేజ్–1 ప్రధాన కాలువ నుండి 9.7కిలోమీటర్ల వద్ద ఎక్లాస్పురం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి కాలువకు గండిపడి నీరంతా పంటపొలాల్లోకి పారింది. దీన్ని గమనించిన అధికారులు, సిబ్బంది హుటాహుటిన మొదటి పంపును ఆఫ్చేయించి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో కాలువ కరకట్ట పూర్తిగా తెగి సమీపంలో ఉన్న పంటపొలాలు సైతం నష్టపోకుండా కాపాడగలిగారు. మొదటి రోజు ఒకమోటార్‌తో 330క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్ ఫేజ్–1 పంపౌజ్ ( నాగిరెడ్డిపల్లి – ఉంద్యాల ) ద్వారా కోయిల్‌సాగర్ జలాశయానికి కాలువ ద్వారా నీటిని తరలించారు. శుక్రవారం రెండో మోటార్‌ను ప్రారంభించిన అధికారులు మొత్తం 660 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా కోయిల్‌సాగర్‌కు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహ ఉధతి ఎక్కువగా ఉండడంతో రెండవ మోటర్‌ను రాత్రివేళ బంద్‌చేయించి ఒకేఒక మోటార్‌తో నీటి ప్రవాహాన్ని కాలువ ద్వారా వదిలేశారు. జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ పనులను చేపట్టకపోవడం ప్రధాన కారణమంటున్నారు. వరదల సమయంలో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి అనుకున్న విధంగా నీటిని తోడుకుంటూ సమీప గ్రామాలలోని చెరువులు నిండిపోతాయని ఆశపడ్డ రైతులకు ఈసంఘటనతో ఆశలు వదులుకుంటున్నారు. గడ్డిపడ్డ ప్రదేశంలో ఐవీఆర్సీఎల్ కంపెనీ సిబ్బందితో పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు అధికారులు దగ్గరుండి కూలీలచే మరమ్మతులు చేపడుతున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు డీఈ హజరతయ్య, జేఈ రాంప్రసాద్, ఏఈఈ జాకీర్ హుస్సేన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టు డీఈ మాట్లాడుతూ శనివారం రాత్రినుంచి నిలిచిపోయిన నీటిసరఫరాను పునఃప్రారంభిస్తామని చెప్పారు. -
నీళ్లిస్తారా.. చావమంటారా?
`మహబూబ్‌నగర్ న్యూటౌన్: తమ గ్రామాల్లో నెలకొన్న నీటిఎద్దడిని నివారించి.. గుక్కెడు తాగునీళ్లు ఇవ్వాలని కోయిల్‌సాగర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్లో పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ఇక్కడే ఉంటామని.. రాకపోతే ఇక్కడే తాగి చస్తామని హెచ్చరించారు. పోలీసులు, ఆందోళనకారుల మద్య కొంతసేపు తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతటితో ఆగకుండా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉందని తెలుసుకున్న రైతులు, ప్రజలు కలెక్టర్ బంగ్లావద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీసీకుంట, దేవరకద్ర, ధన్వాడ మండలాల పరిధిలోని 64 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కోయిల్‌సాగర్‌లో ప్రస్తుతం 12ఫీట్ల నీరు నిల్వ ఉందని, అందులో రెండుఫీట్ల నీరు కాల్వల ద్వారా వదలాలని డిమాండ్ చేశారు. ఈ నీటితో బోర్లు రీచార్జి కావడమే కాకుండా పశువులకు, ఆయా గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. రెండురోజులుగా తాగునీరు ఇవ్వాలని కలెక్టరేట్లో నిరీక్షిస్తుంటే కలెక్టర్ తమ సమస్యను పట్టించుకోకుండా కార్యాలయం వైపు చూడటంలేదని ఆరోపించారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని చెబుతున్నారని, మరి పశువులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. వేల కొద్ది గొర్రెలున్నాయని, తాగునీరు లేక ఇప్పటికే చాలా గొర్రెలు చనిపోయాయని పేర్కొన్నారు. కోయిల్‌సాగర్ నుంచి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయకపోతే అక్కడినుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి తాగునీటిని ఆపేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బుధవారం ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలతో సమావేశం నిర్వహించి తాగునీరు అందించే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీఇవ్వడంతో వారు వెనుదిరిగారు. -
4 ప్రాజెక్టులకు 11 నుంచి నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ప్రధాన ఎత్తిపోతల ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ల కింది ఆయకట్టుకు ఈ నెల 11 నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల, శ్రీశైలం నుంచి ఈ ఆయకట్టులోని లక్షా 29వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి గతేడాదే 75 శాతం పనులు పూర్తయ్యాయి. అప్పడు కూడా జూరాల, శ్రీశైలం నుంచి నీటి విడుదల జరిగినా, పనులు పూర్తికాకపోవడం వల్ల ఆయకట్టు లక్ష ఎకరాలకు మించలేదు. ఈ ఏడాది కాలంలో మరో 10 శాతం పనులు పూర్తికావడంతో ఆయకట్టు మరో 40 వేల ఎకరాలు పెరగనుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒప్పందం మేరకు ఒక వారం కర్ణాటక, మరోవారం తెలంగాణ వాడుకోవాలి. ఈ వారం మొత్తం విద్యుత్‌ను కర్ణాటక వాడుకోగా, సోమవారం నుంచి తెలంగాణ వంతు రానుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మొత్తం 120 మెగావాట్ల విద్యుత్‌లో 97 మెగావాట్లను ఎత్తిపోతలకు వాడుకొని ఈ నాలుగు ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.