గండి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు డీఈ, ఐవీఆర్‌సీఎల్ సిబ్బంది
కోయిల్‌సాగర్ కెనాల్‌కు గండి
Published Sat, Jul 23 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
– నిలిచిన నీటిసరఫరా
– యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు
నర్వ : భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతులమీదుగా గత గురువారం కోయిల్‌సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేసిన మూడోరోజే కోయిల్‌సాగర్ కాలువకు గండిపడింది. కోయిల్‌సాగర్ ఫేజ్–1 ప్రధాన కాలువ నుండి 9.7కిలోమీటర్ల వద్ద ఎక్లాస్‌పురం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి కాలువకు గండిపడి నీరంతా పంటపొలాల్లోకి పారింది. దీన్ని గమనించిన అధికారులు, సిబ్బంది హుటాహుటిన మొదటి పంపును ఆఫ్‌చేయించి నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో కాలువ కరకట్ట పూర్తిగా తెగి సమీపంలో ఉన్న పంటపొలాలు సైతం నష్టపోకుండా కాపాడగలిగారు. మొదటి రోజు ఒకమోటార్‌తో 330క్యూసెక్కుల నీటిని కోయిల్‌సాగర్ ఫేజ్–1 పంపౌజ్ ( నాగిరెడ్డిపల్లి – ఉంద్యాల ) ద్వారా కోయిల్‌సాగర్ జలాశయానికి కాలువ ద్వారా నీటిని తరలించారు. శుక్రవారం రెండో మోటార్‌ను ప్రారంభించిన అధికారులు మొత్తం 660 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా కోయిల్‌సాగర్‌కు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నీటి ప్రవాహ ఉధతి ఎక్కువగా ఉండడంతో రెండవ మోటర్‌ను రాత్రివేళ బంద్‌చేయించి ఒకేఒక మోటార్‌తో నీటి ప్రవాహాన్ని కాలువ ద్వారా వదిలేశారు. జలాశయానికి నీటిని తీసుకెళ్లే కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ పనులను చేపట్టకపోవడం ప్రధాన కారణమంటున్నారు. వరదల సమయంలో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి అనుకున్న విధంగా నీటిని తోడుకుంటూ సమీప గ్రామాలలోని చెరువులు నిండిపోతాయని ఆశపడ్డ రైతులకు ఈసంఘటనతో ఆశలు వదులుకుంటున్నారు. గడ్డిపడ్డ ప్రదేశంలో ఐవీఆర్‌సీఎల్ కంపెనీ సిబ్బందితో పాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు అధికారులు దగ్గరుండి కూలీలచే మరమ్మతులు చేపడుతున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు డీఈ హజరతయ్య, జేఈ రాంప్రసాద్, ఏఈఈ జాకీర్ హుస్సేన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టు డీఈ మాట్లాడుతూ శనివారం రాత్రినుంచి నిలిచిపోయిన నీటిసరఫరాను పునఃప్రారంభిస్తామని చెప్పారు.
Advertisement
Advertisement