కోయిల్‌సాగర్ కుడి కాల్వకు పడ్డ గండి
ధన్వాడ : కోయిల్‌సాగర్ ప్రధాన కుడి కాల్వకు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. దీంతో ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కేఎస్పీ ప్రధాన కుడి కాల్వకు గండి కొట్టడంతో నీరంతా ఊకచెట్టు వాగులో ప్రవహించింది. ఈ విషయమై వెంటనే రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తేరుకున్న ప్రాజెక్టు అధికారులు కుడి కాల్వ ద్వారా విడుదల అవుతున్న నీటిని ఆదివారం ఉదయం నిలిపివేశారు. ముమ్మరంగా వరినాట్లు వేసుకునే సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాల్వలో పెరిగిన ముళ్లచెట్లు, అధ్వానంగా మారిన తూముల వల్ల చివరి ఆయకట్టుకు చుక్కనీరు చేరకపోవడంతొ చివరి ఆయకట్టు రైతులు కాల్వకు గండి కొట్టినట్లు పై ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కుడి కాల్వకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కాల్వకు గండి పడిందని అధికారులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గోటూర్, పూసల్‌పహాడ్, తీలేర్ రైతులు కోరుతున్నారు.