నిరూపిస్తే రాజీనామా చేస్తా: కోలగట్ల
సాక్షి, విజయనగరం: మూడు లాంతర్లు చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ కట్టడం నమోదైందని నిరూపిస్తారా? అని సవాలు విసిరారు. కాగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వీరభద్ర స్వామి ఆదివారం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. (‘జూమ్’లో చర్చకు సిద్ధం.. మంత్రి బొత్స సవాల్)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు లాంతర్ల ఆధునీకరణను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడితే పట్టించుకోకుండా బంగ్లాకే పరిమితమయ్యారని, ఇప్పుడేమో ఉనికి కోసం రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. మోతి మహాల్, పూల్ బాగ్ ప్యాలెస్‌లను నేలమట్టం చేసినప్పుడు అవి పురాతన కట్టడాలు అని గుర్తు రాలేదా? అని ఎద్దేవా చేశారు. మూడు లాంతర్లు చారిత్రాక కట్టడమంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాత్రిపూట ప్రజలకు దారి చూపేందుకు మాత్రమే మూడు లాంతర్లు ఏర్పాటు చేశారని వీరభద్ర స్వామి స్పష్టం చేశారు. (చంద్రబాబు వివరణ ఇవ్వగలరా?: సంచయిత)
కాగా చారిత్రక నేపధ్యం కలిగిన విజయనగరంలోని మూడు లాంతర్ల స్థూపాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ వెల్లడించారు. నగర సుందరీకరణలో భాగంగానే మూడు లాంతర్ల జంక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యమున్న కట్టడాలను కూల్చుతారన్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు.
నగరంలోని ఆరు ప్రాంతాలను అత్యాధునికీకరించేందుకు చర్య లు చేపట్టామన్నారు. కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, మ యూరి జంక్షన్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్, కొత్తపేట నీళ్ళ ట్యాంక్ జంక్షన్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. మూడు లాంతర్లను ముగ్గురు మహిళలు చేతబూనేలా స్థూపాన్ని రూపొందించనున్నట్టు వివరించారు. జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిమను కూడా అమర్చుతున్నట్లు చెప్పారు. మూడు లాంతర్ల పై ఉన్న మూడు సింహాల ప్రతిమను ఎంతో పవిత్రంగా తమ కార్యాలయంలో భద్రపరిచినట్టు చెప్పారు. మొత్తం రూ.5 లక్షల నిధులతో ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.