kolcharam mandal
-
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మెదక్ : జిల్లాలోని కొల్చారం మండలంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.హైదరాబాద్ నుండి మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోయినవారిలో మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన చాకలి శ్రీవర్శిని(2),వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల నిర్మల(46), అప్పాజీపల్లి గ్రామానికి చెందిన అతినగరం సుమలత(25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందాడు. కిష్టాపూర్ కు చెందిన తల్లీ కుమారుడు చాకలి ఇందిర, చాకలి వర్షిత్, వారిగుంతమ్ గ్రామానికి చెందిన ముత్యాల స్వామి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రమాదం జరిగిన చోటు అంతా చీకటిగా ఉండడంతో కాస్త ఇబ్బంది ఏర్పడింది. అయితే స్థానికుల సెల్ఫోన్ల లైట్ల ఆధారంగా గాయపడ్డవారిని పోలీసులు మొదట మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినా.. పరిస్థితి విషమించడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.(చదవండి : అసెంబ్లీ సాక్షిగా తల్లి మెడపై కత్తి పెట్టి..) -
వృథాగా నీటి సంపులు
కొల్చారం: గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రక్షిత మంచినీటి ట్యాంకులు, సంపులు వృథాగా మారి ప్రజాధనం వృథాగా మారుతున్నాయి. మండలంలోని రంగంపేట గ్రామంలో 12 ఏళ్ల క్రితం రూ.10 లక్షలు వెచ్చించి సంపు నిర్మించారు. నాటి నుంచి నేటికీ సంపును ఉపయోగంలోకి తేవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం సంపు పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ పెచ్చులూడి ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది సంపు. చిన్నఘనాపూర్ గ్రామంలో ఏడాది క్రితం పాఠశాల ఆవరణలో ప్రజా అవసరాల కోసం సంపును నిర్మించినా ఇప్పటికి వినియోగంలోకి తేవడం లేదు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే సంపుల నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
పెచ్చులూడుతున్న పైకప్పు
శిథిలావస్థకు చేరిన వైమాందాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్లు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు కొల్చారం: మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. నాలుగు గదుల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ఒకటో తరగతిలో 22 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది. గదుల్లోని పైకప్పులు, వరండాలో పెచ్చులూడిపడుతున్నాయి. ఇనుప ఊచలు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వర్షం వచ్చిందంటే పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయడం లేదు. పాఠశాల దుస్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యక్షంగా చూపించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదనపు గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అమలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధ్వానంగా... మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మిస్తామని అధికారుల చెబుతున్నా మంజూరు చేయడం లేదు. కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలి. - దుర్గయ్య, వైమాందాపూర్ అధికారులు స్పందించాలి పాఠశాలలో అన్ని వసతులు, మంచి ఉపాధ్యాయులున్నారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. మా పిల్లలు భయపడుతున్నప్పటికీ గత్యంతరం లేక పంపిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - సురేష్, ఎస్ఎంసీ వైస్‌చైర్మన్ దారుణంగా ఉంది ప్రస్తుతం పాఠశాల భవనం పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. భయం భయంగానే పాఠాలు చెబుతున్నాం. ఈ విషయాన్ని అధికారులకు చెబుతూనే ఉన్నాం. - దేవరాజ్, హెచ్ఎం