Kolijiyam system
-
హైకోర్టు సీజేగా ఆర్ఎస్ చౌహాన్.. !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం చౌహన్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. ఇక హైకోర్టు లో నెంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వీ. రామసుబ్రమణియన్ కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయి.. జస్టిస్ బాబ్దే.. జస్టిస్ ఎన్ వీ రమణలతో కూడిన కొలీజియం సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేసిన తరువాత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తరువాత వీరి నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తరువాత ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టు కి బదిలీ అయ్యారు. దీనితో సీనియర్ అయిన జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం... జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సినీయర్ న్యాయవాదులు కె. సార్వభౌమన్, టి.ఆర్. మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత కేంద్రం ఈయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గా నియమించింది. -
జస్టిస్ జోసెఫ్‌ను కేంద్రం కావాలనే అడ్డుకుంది
న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందా? కొలీజియం సిఫార్సులు చెల్లుబాటు కాకుండా మోకాలడ్డుతోందా? కొలీజియం సిఫార్సుల జాబితాలోని పేర్లకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైనాన్ని సాక్షాత్తు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించిన సమయంలోనే... ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపింది. కేంద్ర నిర్ణయం ఎంతమాత్రం సహేతుకంగా లేదని... తీర్పులు, పద్ధతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని దీనిద్వారా కేంద్రం ఇచ్చినట్లు కనబడుతోందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి తన మనసులోని మాట చెప్పారు. జస్టిస్ జోసెఫ్ పదోన్నతి విషయంలో కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పి పంపడంపై మీ అభిప్రాయం? మూడు కారణాలు చూపించి కేంద్రం ఈ పని చేసింది. అందులో మొదటిది–జోసెఫ్ కంటే 42 మంది న్యాయమూర్తులు సీనియర్లుగా ఉన్నారు. రెండు– కేరళ నుంచి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తి ఉన్నారు. మూడు–సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా దళితులు లేరు. కేంద్రం చెప్పిన ఈ మూడు కారణాలూ ఏ మాత్రం సహేతుకంగా లేవు. ఎందుకు సహేతుకంగా లేవో వివరిస్తారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేందుకు ఆలిండియా సీనియార్టీ విధానం ఎప్పుడూ లేదు. కేరళకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఒకరుంటే రెండో వ్యక్తి న్యాయమూర్తి కాకూడదనేమీ లేదు. మహారాష్ట్రకు చెందిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అయిదుగురున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు, చిన్న ప్రాంతమైన ఢిల్లీకి చెందిన వారు ముగ్గురు సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. మరి జస్టిస్ జోసెఫ్ విషయంలో మాత్రమే అభ్యంతరం ఎందుకు? ఇక చివరి అభ్యం తరం.. దళితులు లేరని చెప్పి జస్టిస్ జోసెఫ్‌కు అడ్డు చెప్పడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికీ, దళితుడు కాకపోవడానికీ సంబంధం ఏముంది? కేంద్రం చెప్పనవన్నీ కుంటిసాకులే. ఆయనను సుప్రీంకోర్టుకు రాకుండా చేసేందుకే ఈ సాకులు చెప్పినట్లు అనిపిస్తోంది. కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపే అధికారం కేంద్రానికి లేదంటారా? ఎందుకు లేదు? ఉంది. అయితే, అందుకూ ఓ పద్ధతి ఉంది. కొలీ జియం సిఫార్సుల్లోని పేర్లపై కేంద్రం సేకరించే కీలక సమాచారంలో ఆ జాబితాలోని వారి ప్రవర్తన, పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉంటే పునః పరిశీలన చేయాలని కేంద్రం కోరవచ్చు. ఇందులో తప్పులేదు. కాని జస్టిస్ జోసెఫ్ పనితీరుపై లేదా ప్రవర్తనపై ఎటువంటి ఆరోపణలు లేవు. మరి ఆయన పేరును ఏ ప్రాతిపదికన వెనక్కి పంపిందనుకోవాలి? జస్టిస్ జోసెఫ్ విషయంలో కేంద్రం ఎందుకలా వ్యవహరిస్తోందంటారు? తెర వెనుక కారణాలు ఏమై ఉంటాయి? తెర వెనుక కాదు.. అన్నీ బహిరంగమే. దీని విషయంలో దాపరికం ఏముంది? ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన చెల్లదని గతంలో జస్టిస్ జోసెఫ్ తీర్పు చెప్పారు. ఆ తీర్పే ఆయనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాకుండా చేస్తోందనిపిస్తోంది. ఆ తీర్పు వారికి అనుకూలంగా లేదు గనుక నచ్చకపోయి ఉండొచ్చు. కొలీజియం సిఫారసులన్నింటినీ కేంద్రం ఆమోదించాలా? మేజి స్ట్రేట్ పరీక్షలో తప్పిన ఒకరి పేరును అనంతరకాలంలో కొలీజియం సిఫార్సు చేస్తే ఆయన న్యాయమూర్తి అయ్యారు కదా... కొలిజీయం అంతా సజావుగా ఉందని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థ లోపభూయిష్టంగా లేదని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాలి. లోటుపాట్లు సరిచేయాలి. ఇవేమీ చేయకుండా ఉన్న వ్యవస్థకే తూట్లు పొడిస్తే ఎలా? ఇలా చేయడం ద్వారా పాలకులు ఏం సందేశం పంపుతున్నారు? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేంద్రం తన గుప్పెట్లో న్యాయవ్యవస్థను పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోందని అనుకోవచ్చా? కేవలం ఈ చర్య ఆధారంగా ఆ నిర్ణయానికి రాలేము. అయితే అలాంటి అపోహలకు ఆస్కారం ఉంది. కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇస్తోంది? న్యాయమూర్తులు వెలువరించే తీర్పులు, వారి పద్ధతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. తమకు అనుకూలంగా ఉండాలనే సందేశాన్ని కేంద్రం పంపినట్లుంది. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతూనే ఉన్న లోటుపాట్లను సరిచేసే దిశగా చర్యలు ఉండాలేగానీ, ఆ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రజలు సైతం దీనిని హర్షించరు. జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం తిరిగి కేంద్రానికి పంపితే.. ఏం చేస్తుంది? ఆమోదించక తప్పదు కదా! – శ్రీనివాస్ పెమ్మరాజు, సాక్షి ప్రతినిధి -
కొంత జీవితం, కొన్ని అభిప్రాయాలు
రైతు సోదరుల ఆత్మహత్యలతో తెలుగు గడ్డ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో- రైతాంగ సంస్కరణ ఎలా ఉండాలి? రాజకీయ నేతలు ఏ విధమైన అంశాలపై దృష్టి పెట్టాలి? అనే దృక్కోణాన్ని స్వాతంత్య్ర సిద్ధి లభించిన తొలినాళ్లలోనే విజయరాజ కుమార్ సమర్థవంతంగా చేసిన ప్రయత్నాలని అక్షరీకరించిన పుస్తకం ఇది. 1939లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ బ్లాక్‌లో ఆంధ్ర ప్రాంతం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి, అటుపై ఆచార్య రంగా కృషికార్ లోక్ పార్టీకి రాష్ర్ట ఆర్గనైజర్‌గా పనిచేసిన నాయకుడు విజయరాజ కుమార్. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయగా ఆమెపై స్వతంత్ర అభ్యర్థిగా ప్రఖ్యాత గణిత శాస్త్త్రజ్ఞ్రురాలు శకుంతల నిలబడి విజయరాజ సహాయం కోరారు అన్న విషయం ఈ పుస్తకంలో తెలుస్తుంది. నలభై రెండేళ్ల క్రితమే ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భంగా ఇందిరాగాంధీకి ఆయన రాసిన బహిరంగ లేఖ నాటి ‘తెలంగాణా’ పత్రికలో సీరియల్‌గా ప్రచురించబడి సంచలనం సృష్టించింది. అందులో కొంత భాగం పుస్తకంలో అందించారు. కావటానికి ఇది విజయరాజ కుమార్ జీవిత చిత్రణే అయినప్పటికీ చదువుతుంటే ‘వర్తమానాన్ని’ తడుముతున్నట్టుగా అనిపిస్తుంది. విజయరాజ మొదటి రచనే సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ‘విప్లవాధ్యక్షుడు’. దానికి సంబంధించిన ఉపోద్ఘాతం, ఇప్పటి బెంగాల్ ప్రభుత్వం బోస్ మరణంపై వివరాల్ని బయటపెట్టే కసరత్తును స్ఫురింపజేస్తుంది. పాల్ఖీవాలా ఆంగ్ల రచనని ‘కొలబద్దకు గురి చేయబడిన న్యాయ విధానం’ అని విజయరాజ చేసిన అనువాద గ్రంథ పరిచయం- భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నాయవాదుల ఎంపిక (కొలీజియమ్ వ్యవస్థ)పై ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తుంది. ఇప్పటికైనా ఆయన అభిప్రాయాలను పుస్తకంగా వెలికి తీసుకొచ్చిన ఆయన తమ్ముడు నరిశెట్టి ఇన్నయ్యను తప్పక అభినందించాలి. (రైతు రాజకీయంలో విజయరాజ కుమార్ నరిశెట్టి; రచన: నరిశెట్టి ఇన్నయ్య; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, ఫోన్: 9866115655; ఇన్నయ్య మెయిల్ : innaiah@gmail.com) వర్చస్వి