జస్టిస్‌ జోసెఫ్‌ను కేంద్రం కావాలనే అడ్డుకుంది | Justice Sudarshan Reddy Interview With Sakshi | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ జోసెఫ్‌ను కేంద్రం కావాలనే అడ్డుకుంది

Published Sun, Apr 29 2018 12:30 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Justice Sudarshan Reddy Interview With Sakshi

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

న్యాయమూర్తుల నియామకాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందా? కొలీజియం సిఫార్సులు చెల్లుబాటు కాకుండా మోకాలడ్డుతోందా? కొలీజియం సిఫార్సుల జాబితాలోని పేర్లకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాసి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైనాన్ని సాక్షాత్తు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించిన సమయంలోనే... ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా  పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపింది. కేంద్ర నిర్ణయం ఎంతమాత్రం సహేతుకంగా లేదని... తీర్పులు, పద్ధతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని దీనిద్వారా కేంద్రం ఇచ్చినట్లు కనబడుతోందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి తన మనసులోని మాట చెప్పారు. 

జస్టిస్‌ జోసెఫ్‌ పదోన్నతి విషయంలో కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పి పంపడంపై మీ అభిప్రాయం?
మూడు కారణాలు చూపించి కేంద్రం ఈ పని చేసింది. అందులో మొదటిది–జోసెఫ్‌ కంటే 42 మంది న్యాయమూర్తులు సీనియర్లుగా ఉన్నారు. రెండు– కేరళ నుంచి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తి ఉన్నారు. మూడు–సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా దళితులు లేరు. కేంద్రం చెప్పిన ఈ మూడు కారణాలూ ఏ మాత్రం సహేతుకంగా లేవు. 

ఎందుకు సహేతుకంగా లేవో వివరిస్తారా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేందుకు ఆలిండియా సీనియార్టీ విధానం ఎప్పుడూ లేదు. కేరళకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఒకరుంటే రెండో వ్యక్తి న్యాయమూర్తి కాకూడదనేమీ లేదు. మహారాష్ట్రకు చెందిన న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అయిదుగురున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ముగ్గురు, చిన్న ప్రాంతమైన ఢిల్లీకి చెందిన వారు ముగ్గురు సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. మరి జస్టిస్‌ జోసెఫ్‌ విషయంలో మాత్రమే అభ్యంతరం ఎందుకు? ఇక చివరి అభ్యం తరం.. దళితులు లేరని చెప్పి జస్టిస్‌ జోసెఫ్‌కు అడ్డు చెప్పడం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడానికీ, దళితుడు కాకపోవడానికీ సంబంధం ఏముంది? కేంద్రం చెప్పనవన్నీ కుంటిసాకులే. ఆయనను సుప్రీంకోర్టుకు రాకుండా చేసేందుకే ఈ సాకులు చెప్పినట్లు అనిపిస్తోంది.

కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపే అధికారం కేంద్రానికి లేదంటారా?
ఎందుకు లేదు? ఉంది. అయితే, అందుకూ ఓ పద్ధతి ఉంది. కొలీ జియం సిఫార్సుల్లోని పేర్లపై కేంద్రం సేకరించే కీలక సమాచారంలో ఆ జాబితాలోని వారి ప్రవర్తన, పనితీరుపై తీవ్ర ఆరోపణలు ఉంటే పునః పరిశీలన చేయాలని కేంద్రం కోరవచ్చు. ఇందులో తప్పులేదు. కాని జస్టిస్‌ జోసెఫ్‌ పనితీరుపై లేదా ప్రవర్తనపై ఎటువంటి ఆరోపణలు లేవు. మరి ఆయన పేరును ఏ ప్రాతిపదికన వెనక్కి పంపిందనుకోవాలి? 

జస్టిస్‌ జోసెఫ్‌ విషయంలో కేంద్రం ఎందుకలా వ్యవహరిస్తోందంటారు? తెర వెనుక కారణాలు ఏమై ఉంటాయి?
తెర వెనుక కాదు.. అన్నీ బహిరంగమే. దీని విషయంలో దాపరికం ఏముంది? ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన చెల్లదని గతంలో జస్టిస్‌ జోసెఫ్‌ తీర్పు చెప్పారు. ఆ తీర్పే ఆయనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి కాకుండా చేస్తోందనిపిస్తోంది. ఆ తీర్పు వారికి అనుకూలంగా లేదు గనుక నచ్చకపోయి ఉండొచ్చు.

కొలీజియం సిఫారసులన్నింటినీ కేంద్రం ఆమోదించాలా? మేజి స్ట్రేట్‌ పరీక్షలో తప్పిన ఒకరి పేరును అనంతరకాలంలో కొలీజియం సిఫార్సు చేస్తే ఆయన న్యాయమూర్తి అయ్యారు కదా...
కొలిజీయం అంతా సజావుగా ఉందని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థ లోపభూయిష్టంగా లేదని ఎవరూ అనడం లేదు. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాలి. లోటుపాట్లు సరిచేయాలి. ఇవేమీ చేయకుండా ఉన్న వ్యవస్థకే తూట్లు పొడిస్తే ఎలా? ఇలా చేయడం ద్వారా పాలకులు ఏం సందేశం పంపుతున్నారు? 

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కేంద్రం తన గుప్పెట్లో  న్యాయవ్యవస్థను పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోందని అనుకోవచ్చా?
కేవలం ఈ చర్య ఆధారంగా ఆ నిర్ణయానికి రాలేము. అయితే అలాంటి అపోహలకు ఆస్కారం ఉంది. 

కొలీజియం సిఫార్సుల్ని తిప్పిపంపడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇస్తోంది?
న్యాయమూర్తులు వెలువరించే తీర్పులు, వారి పద్ధతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తోంది. తమకు అనుకూలంగా ఉండాలనే సందేశాన్ని కేంద్రం పంపినట్లుంది. ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతూనే ఉన్న లోటుపాట్లను సరిచేసే దిశగా చర్యలు ఉండాలేగానీ, ఆ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రజలు సైతం దీనిని హర్షించరు. జస్టిస్‌ జోసెఫ్‌ పేరును కొలీజియం తిరిగి కేంద్రానికి పంపితే.. ఏం చేస్తుంది? ఆమోదించక తప్పదు కదా!

– శ్రీనివాస్‌ పెమ్మరాజు, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement