సభా గౌరవాన్ని కాపాడతా...
నిష్పక్షపాతంతో బాధ్యతల నిర్వహణ
స్పీకర్ కె.బి.కోళివాడ
బెంగళూరు:‘ఎలాంటి పక్షపాతం లేకుండా అందరు సభ్యులను సమాన దృష్టితో పరిగణిస్తూ, శాసనసభ సత్సాంప్రదాయాన్ని, గౌరవాన్ని నిలబెడతాను’ అని స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన కె.బి.కోళివాడ పేర్కొన్నారు. కర్ణాటక శాసనసభ స్పీకర్గా కె.బి.కోళివాడ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో సభలోని అన్ని పార్టీల సభ్యులు కె.బి.కోళివాడకు అభినందనలు తెలియజేశారు. శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కె.బి.కోళివాడ మాట్లాడుతూ....‘సభలోని 225 మంది సభ్యుల హక్కుల రక్షణ సభాపతిగా నా బాధ్యత, గతంలో స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించిన వారు సభను సజావుగా నడిపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో అదే బాటలో నేను నడుస్తాను, నన్ను స్పీకర్గా ఎంపిక చేసిన సీఎం సిద్ధరామయ్య, మంత్రులు, విపక్ష నేతలు, ఇతర ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, సంయమనం, నిష్పక్షపాతంతో నా బాధ్యతలు నిర్వర్తిస్తాను’ అని తెలిపారు.
ఇక ప్రభుత్వం దారితప్పుతోందనే సమయంలో ప్రతిపక్షం తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోళివాడ పేర్కొన్నారు. ఆ సందర్భంలో తాను కూడా ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేస్తానని అన్నారు.