kolkata port
-
బెంగాల్ పర్యటనలో మోదీ కీలక నిర్ణయం
కోల్కత: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్కత నౌకాశ్రయానికి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం ఆలోచనకు అంకురార్పణ చేసిన గొప్ప నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ప్రధాని కొనియాడారు. సత్యాగ్రహం నుంచి స్వచ్చాగ్రహం (స్వచ్ఛ భారత్) వరకు ఎన్నో అనుభూతులకు కోల్కత పోర్టు వేదికైందని గుర్తు చేశారు. ఎందరో వ్యాపారస్తులు, గొప్ప గొప్ప నాయకులు పోర్టు సేవలను పొందారని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరవడం గమనార్హం. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాందవియా తదితరులు హాజరయ్యారు. -
ఉగ్రవాదులు వస్తున్నారు.. జాగ్రత్త!!
కోల్కతా ఓడరేవుపై అల్ కాయిదా ఉగ్రవాదులు దాడి చేయొచ్చని నిఘా విభాగం హెచ్చరించింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు కోల్కతా చేరుకోవచ్చని ఐబీ తెలిపింది. కోల్కతాకు 'హై ఎలర్ట్' ప్రకటించింది. గతంలో ముంబై దాడులు చేసినప్పుడు కూడా ఉగ్రవాదులు సముద్రమార్గంలోనే భారత భూభాగం మీదకు ప్రవేశించిన విషయాన్ని భద్రతారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా మన దేశానికి చెందిన రెండు ప్రధాన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ పృథ్వి, ఐఎన్ఎస్ సుమిత్రలను వెంటనే సముద్రంలోకి పంపారు. ప్రస్తుతం నేవీ ఉత్సవాలు జరుగుతున్నందున ఈ రెండింటినీ తీరంలో ఉంచారు. కానీ.. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో వీటిని సముద్రంలోకి పంపారు. రక్షణ మంత్రి కూడా దీనిపై మాట్లాడారు. అనుకోని పరిస్థితుల్లోనే వీటిని పంపామని అన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా భద్రతను పెంచింది. వెంటనే అప్రమత్తమై.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోస్ట్ గార్డ్, సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీచేశారు. అల్ కాయిదా దాడులు చేసే ప్రమాదం ఉందంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఐబీ విడుదల చేసిన 'హై ఎలర్ట్'లో అల్ కాయిదా పేరు లేకపోయినా.. ఉగ్రవాదులు రావచ్చని మాత్రం చెప్పారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.