ఎన్ని పాలసీలైనా తీసుకోవచ్చా..
నా కూతురు ఏడాది వయస్సున్నప్పటి నుంచి కోమల్ జీవన్ పాలసీ ప్రీమియమ్‌లు చెల్లిస్తున్నాను. ఏడాదికి రూ.36,000 చొప్పున ఇప్పటిదాకా పదేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. మరో పదేళ్ల పాటు చెల్లించాల్సి ఉంది. రూ. 5 లక్షల బీమా రక్షణ తీసుకున్నాను. ఇది సరైన పాలసీయేనా? ఈ పాలసీలో కొనసాగమంటారా? సరెండర్ చేయమంటారా? తగిన సలహా ఇవ్వండి.
- తేజస్వి, హైదరాబాద్
ఎల్ఐసీ కోమల్ జీవన్ పాలసీ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వ్యయాలను వెల్లడించవు. ఈ పాలసీ ఏడాదికి 7.5 శాతం గ్యారంటీడ్ ఎడిషన్స్‌ను అందించగలదు. ఇది దాదాపు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడికి సమానం. పాలసీ తీసుకున్న వ్యక్తి వృతి చెందినప్పుడు/పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లాయల్టీ బోనస్‌లను కూడా చెల్లిస్తారు. రూ.5 లక్షల బీమా రక్షణను పరిగణనలోకి తీసుకుంటే ఈ పాలసీలో కొనసాగడం సరైనది కాదని భావిస్తున్నాం. ఇన్వెస్ట్‌మెంట్‌ను, ఇన్సూరెన్స్‌ను కలగలపవద్దని ఎప్పుడూ పాఠకులకు సూచిస్తూ ఉంటాం. బీమా అవసరాల కోసం టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోండి.
ఒక వ్యక్తి ఎన్ని బీమా పాలసీలనైనా తీసుకోవచ్చా? ఇది టర్మ్ ప్లాన్లు/మెడిక్లెయిమ్స్కు కూడా వర్తిస్తుందా? ఇలా పలు పాలసీలు తీసుకున్నప్పటికీ, అన్ని పాలసీలనూ క్లెయిమ్ చేసుకోవచ్చా?
- సురేందర్, విజయవాడ
మీరు ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలైనా తీసుకోవచ్చు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బీమా పాలసీలే తీసుకుంటారు. పెద్ద మొత్తంలో టర్మ్ కవర్ తీసుకునేటప్పుడు కనీసం రెండు కంపెనీలవి తీసుకుంటారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇది వర్తించదు. మీరు తీసుకున్న బీమా రక్షణ నిష్పత్తికి లోబడి చెల్లింపులుంటాయి. ఉదాహరణకు మీరు రూ.2 లక్షలకు, రూ.5 లక్షలు చొప్పున రెండు మెడిక్లెయిమ్ పాలసీలు తీసుకున్నారనుకుందాం. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు 2:5 నిష్పత్తిలో మీ క్లెయిమ్‌ను చెల్లిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపకుండా ప్రీమియమ్‌లు చెల్లించగలిగిన రీతిలో పాలసీలు తీసుకుంటే సముచితంగా ఉంటుంది.
నేనొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) కింద ఏడాదికి రూ.80,000 చెల్లిస్తున్నాను. నేను ఇప్పటికే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో రూ. లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేశాను. నాకు పన్ను రాయితీ ఎంత వస్తుంది ?
- మూర్తి, విశాఖపట్టణం
సెక్షన్ 80సీ, 80 సీసీడీ కింద మొత్తం పన్ను రాయితీ రూ.2 లక్షలు మాత్రమే వస్తుంది. కానీ మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ రూ.2.3 లక్షలుగా ఉన్నాయి. (ఎన్పీఎస్ కింద రూ.80,000, ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ల్లో రూ. లక్షన్నర). సెక్షన్ 80 సీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రూ.1.5 లక్షవరకూ పన్ను రాయితీ పొందవచ్చు. మీరు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.80,000కు పన్ను మినహాయింపు పొందలేరు. కేవలం రూ.50,000 మొత్తానికి మాత్రమే సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద పన్ను రాయితీ పొందవచ్చు. వచ్చే ఏడాది గరిష్ట పరిమితిని మించకుండా చూసుకోండి. మీరు ఎన్‌పీఎస్‌లో రూ.80,000 ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే, సెక్షన్ 80 సీ కింద మినహాయింపు కావాలంటే మిగిలిన పత్రాల్లో రూ.1.2 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే రెండు సెక్షన్ల కింద గరిష్టంగా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఎన్పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రూ.50,000 వరకూ సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు.
కమోడిటీలు ప్రస్తుతం చౌకగా ఉన్నాయి. అందుకే కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన తరుణమని నేను భావిస్తున్నాను. నా నిర్ణయం సరైనదేనా?
- అభిమన్యు, బెంగళూరు
దేశీయ, అంతర్జాతీయ కమోడిటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసే పలు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కమోడిటీలతో సహా ధీమాటిక్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయడం సరైన పెట్టుబడి వ్యూహం కాదని చెప్పడానికి ఎన్నో కారణాలున్నాయి. కమోడిటీ వ్యాపారాలు చక్రగతిన ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ వివిధ దశల్లో వివిధ కమోడిటీల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఒక కమోడిటీ ప్రస్తుత స్థాయి ఏమిటి అన్న విషయం నిర్ధారించడానికి ఇన్వెస్టర్‌కు తప్పనిసరిగా ఆ కమోడిటీ గురించి తగిన అవగాహన ఉండితీరాలి. కానీ సగటు ఇన్వెస్టర్‌కు అది సాధ్యం కాదు. ఈ కమోడిటీల్లో లాభం పొందేందుకు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకోవాలో కూడా తెలిసుండాలి. ఆ కమోడిటీ పట్ల తగిన పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్‌కు ఇది అసాధ్యమైన విషయమే కదా ! మీరు విభిన్నమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, వృద్ధిలో ఉన్న కమోడిటీ సంబంధిత కంపెనీ షేర్ ఈ ఫండ్ యూనిట్లలో ఉంటే మీరు ఆ మేరకు లాభపడే అవకాశాలున్నాయి.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్