కాంగ్రెస్కు మరో షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్న కొమ్మూరి కు టుంబం వైఎస్సార్సీపీలో చేరింది. గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసి 39,937ఓట్లు సాధించిన కందుల రఘురాం కూడా వైఎస్సార్ సీపీ తీర్థం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. వారితో పాటు డీసీసీబీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న, మాజీ ఎంపీటీసీలు బర్రి దాసు, మైలపల్లి అప్పన్న, మాజీ సర్పంచ్ మైలపల్లి గాంధీ తదితరులు కూడా వైఎస్సార్ సీపీ కండువా వేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పెను మత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త బేబీనాయన, ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తి రుపతి, తదితరులు పాల్గొన్నారు.
కందుల రఘురాం చేరికతో భోగాపురంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో కొమ్మూరి కుటుంబానికి మంచి పట్టు ఉంది. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో వారికున్న పట్టు ముందు మిగతా నాయకులు బలా దూరే. ఏది చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటించే కేడర్ బలం వారికి ఉంది. అంతటి పట్టు ఉన్న నాయకులు ఇప్పుడు వైఎస్సార్ సీపీలో చేరడంతో ప్రత్యర్థి పార్టీలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపు ఆశలు వదిలేసుకున్నట్టు అయ్యింది. టీడీపీకి అంతుచిక్కడం లేదు. ఒక్కొక్కరుగా అటు కాంగ్రెస్ , ఇటు టీడీపీ నుంచి చేరడంతో నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సీపీ తిరుగులేని పట్టు సాధించింది.