Komuravelli Sri Mallikarjuna Swamy Temple
-
తెలంగాణ గుళ్లకు ఐటీ శాఖ నోటీసులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట: తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి, రాజన్న, బాసర ఆలయాలకు నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉంది. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను జారీ చేశారు. అదే విధంగా వేములలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలనికి కూడా ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ఇక బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. చదవండి: ఈనెల రెండో వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ -
‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’
సాక్షి సిద్దిపేట: పట్నం, బోనం అంటేనే మల్లన్న జాతర గుర్తుకు వస్తుందని.. మల్లన్న, కొండపోచమ్మను పూజిస్తే అందరూ చల్లగా ఉంటారని మంత్రి హరీష్‌రావు అన్నారు. వీరశైవ ఆగమన శాస్త్ర సంప్రదాయం ప్రకారం శ్రీమల్లికార్జున స్వామికి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణ మహోత్సవ వేడుకలో హరీష్‌రావు ఆదివారం పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో స్వామివారికి హరీష్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఆలయానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర అని.. మల్లన్న దయవల్ల ఈ ప్రాంతం కరువు పోయి సస్యశ్యామలం అయిందని ఆయన పేర్కొన్నారు. మద్దూర్, చేర్యాల, కొమురవేల్లి, నంగునూరు మండలాల్లో కరువు ఉండేదని.. మల్లన్న దయతో గోదావరి జలాలతో కరువు తోలిగిపోయిందన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్లు శ్రీమల్లికార్జున స్వామి దయతో పూర్తయ్యాయని మంత్రి హరీష్ తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు మల్లన్న దేవుని దయతో పూరై.. గోదావరి జలాలు కాళేశ్వరం లింగం వద్ద అభిషేకం చేసుకొని మల్లన్న పాదాలను తాకి మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌ను చేరాలన్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు రెండు పంటలు పండించుకోవచ్చని మంత్రి హరీష్ పేర్కొన్నారు. పంట, పాడి పశువులు కాపాడే దేవుడు మల్లన్న దేవుడు అని.. మల్లన్న ఆలయంలో రూ. 30 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హరీష్ తెలిపారు. వేడుకలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. -
అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణం
కొమురవెల్లి (సిద్దిపేట): జానపదుల ఆరాధ్య దైవం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ఆలయ తోటబావి ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పచ్చని పందిళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో జరిగిన శ్రీమల్లికార్జునస్వామి, బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుండగా.. వీరశైవ ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో శ్రీశైలానికి చెందిన పీఠాధిపతి శ్రీమత్ జగద్గురు 1,008వ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం, స్వస్తివచనం, మండప దేవతారాధన, ప్రతిష్ట పాదార్చన, భాషింగ గధారణ, జీలకర్ర బెల్లం, వస్త్రాలంకరణ, మధు సంపర్క స్వీకరణ అనంతరం కన్యాదానం, మాంగల్య సూత్రధారణ జరిపారు. ప్రభుత్వం తరఫున శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మల్లన్న కల్యాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం, ఆలయ చైర్మన్ సెవెల్ల సంపత్, డీఆర్ఏ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీసీపీ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ సుంకరి సరతి, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, ధర్మకర్తలు ముత్యం నర్సింహులు, ఉడుత మల్లేశం, బచ్చు మురళి తదితరులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌కు మల్లన్న ముత్యాల తలంబ్రాలు.. శ్రీమల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌కు స్వామివారి కల్యాణంలోని ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. తలంబ్రాలతో పాటు లడ్డూ ప్రసాదం అందజేసి స్వామి వారి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ సెవెల్ల సంపత్, ఆలయ ఈఓ వెంకటేశ్, అర్చకలు, వేద పండితులు ఉన్నారు. -
మల్లన్నకు పెద్దపట్నం
చేర్యాల: వరంగల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో రేపల్లెను తలపించేలా శ్రీకృష్ణాష్టమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నుండి ఒగ్గు పూజారులు మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. స్వామికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి అనంతరం ఆలయ గంగిరేగు చెట్టు వద్ద ఉట్టి ఏర్పాటు చేశారు. అక్కడే 31 వరుసలతో పంచరంగులతో పెద్ద పట్నం తయారు చేసి పట్నం వేశారు. గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామి సన్నిధిలో ఉట్టిని కొట్టి పెద్దపట్నంను దాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.