మల్లన్న స్వామి కల్యాణోత్సవంలో మాంగల్యధారణ ఘట్టం
కొమురవెల్లి (సిద్దిపేట): జానపదుల ఆరాధ్య దైవం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ఆలయ తోటబావి ప్రాంగణంలో మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పచ్చని పందిళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో జరిగిన శ్రీమల్లికార్జునస్వామి, బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతుండగా.. వీరశైవ ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో శ్రీశైలానికి చెందిన పీఠాధిపతి శ్రీమత్ జగద్గురు 1,008వ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు గణపతిపూజ, పుణ్యాహవచనం, స్వస్తివచనం, మండప దేవతారాధన, ప్రతిష్ట పాదార్చన, భాషింగ గధారణ, జీలకర్ర బెల్లం, వస్త్రాలంకరణ, మధు సంపర్క స్వీకరణ అనంతరం కన్యాదానం, మాంగల్య సూత్రధారణ జరిపారు. ప్రభుత్వం తరఫున శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మల్లన్న కల్యాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం, ఆలయ చైర్మన్ సెవెల్ల సంపత్, డీఆర్‌ఏ చంద్రశేఖర్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీసీపీ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ సుంకరి సరతి, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, ధర్మకర్తలు ముత్యం నర్సింహులు, ఉడుత మల్లేశం, బచ్చు మురళి తదితరులు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్‌కు మల్లన్న ముత్యాల తలంబ్రాలు..
శ్రీమల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌కు స్వామివారి కల్యాణంలోని ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. తలంబ్రాలతో పాటు లడ్డూ ప్రసాదం అందజేసి స్వామి వారి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ సెవెల్ల సంపత్, ఆలయ ఈఓ వెంకటేశ్, అర్చకలు, వేద పండితులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment