వ్యవసాయ వర్సిటీ వీసీల నియామకానికి కసరత్తు
- నియామక విధానంపై నివేదిక కోరిన సర్కారు
- సమాచారం పంపిన వ్యవసాయాధికారులు
సాక్షి, హైదరాబాద్ : జయశంకర్ వ్యవసాయ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకానికి రంగం సిద్ధమైంది. వీటికి ప్రభుత్వమే నేరుగా వీసీలను నియమిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వర్సిటీల నిబంధనల ప్రకారం నియామక విధానాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. వ్యవసాయశాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో నియామక ప్రక్రియ ఊపందుకుంది.
రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు వీసీలు లేకుండానే వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల పాలన కొనసాగుతోంది. వ్యవసాయ వర్సిటీకి ప్రత్యేకాధికారిగా ప్రవీణ్‌రావు, ఉద్యాన వర్సిటీ ఇన్చార్జి వీసీగా వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వ్యవహరిస్తున్నారు. రోజువారీ పరిపాలనా వ్యవహారాలను రిజిస్ట్రార్ ప్రతాప్ పర్యవేక్షిస్తున్నారు. వీసీలు లేక వర్సిటీల్లో అభివృద్ధికి విఘాతం ఏర్పడింది. ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది.
వ్యవసాయ వర్సిటీకి నేరుగా..
రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వర్సిటీలకు మొదటి వీసీల నియామకం జరగబోతోంది. ఉమ్మడి ఏపీలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఉండగా... రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సెప్టెంబర్ 1 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉనికిలోకి వచ్చింది. వర్సిటీ నిబంధనల ప్రకారం చాన్స్‌లరే వీసీ ని నియమించాలని వ్యవసాయశాఖ తెలిపింది. అంటే ప్రభుత్వమే వీసీని నేరుగా నియమించడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యాన వర్సిటీ నిబంధనల ప్రకారం వీసీని సెర్చ్ కమిటీ ద్వారా నియమించాలి. కమిటీ రూపొందిం చిన ప్యానెల్ నుంచి ఒకరిని చాన్సలర్ వీసీగా నియమిస్తారు.