నెత్తురోడిన రహదారి
ఆటోను ఢీకొట్టిన లారీ
ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు
తమ్ముడికి వైద్యం చేయిద్దామని తోడు వచ్చిన అన్న....అంతలోనే అనంతలోకాల్లో కలిసిపోయాడు. ఆటో నడిపే డ్రైవర్‌కు భుక్తినిచ్చే వాహనమే మృత్యువాహనమైంది. కాసేపట్లో గ్రామానికి చేరుకోవాల్సిన వృద్ధురాలు...ఆస్పత్రిలో అసువులు బాసింది. స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్లో శనివారం జరిగిన దుర్ఘటన ముగ్గురిని బలితీసుకుంది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళుతున్న ఆటోను ఢీకొని నుజ్జునుజ్జు చేసింది.
అనకాపల్లి రూరల్: ఆటోను లారీ ఢీకొన్న దుర్ఘటనలో కొండా యశ్వం త్ (10) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో నడుపుతున్న డ్రైవర్ సహా మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. వివరాలివి. కె.లక్ష్మి అనే మహిళ తన పది నెలల కుమారుడు నిషాం త్‌కు వైద్యానికి అనకాపల్లి వెళుతూ తోడుగా అక్క కొడుకు యశ్వంత్‌ను తీసుకెళ్లింది. నిషాంత్‌కు వైద్యం చేయించి స్వగ్రామం తిమ్మరాజుపేట వెళ్లేందుకు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆటో ఎక్కారు.
ఇదే ఆటోలో కృష్ణాపురం, తిమ్మరాజుపేట, మడుతూరు, హరిపాలెం, అచ్యుతాపురం గ్రామాలకు వెళ్లేవారు కూడా ఎక్కారు. ప్రయాణించిన కొద్ది నిమిషాలకే పూడిమడక రోడ్డు ైబైపాస్ జంక్షన్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణాపురానికి చెందిన ఆటోడ్రైవర్ ఎం. మారుతీరావు(54) తలకు బలమైన గాయమైంది. ఇదే గ్రామానికి చెందిన కె. వరాలమ్మ(55) రెండుకాళ్లు, చేయి తెగిపడిపోయాయి.
అచ్యుతాపురానికి చెందిన ఎస్. కృష్ణ తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని స్థానికులు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మారుతీరావు, వరాలమ్మ చనిపోయారు. కాగా హరిపాలేనికి చెందిన బి. సుశీల, జి. సరోజిని, మడుతూరుకు చెందిన బి. గణేశ్వరి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరో ఇద్దరిని అనకాపల్లిలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన యశ్వంత్ పిన్ని, ఆమె పది నెలల కొడుకు నిషాంత్ పట్టణంలోని తల్లీపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యశ్వంత్ తండ్రి చెట్ల నుంచి కొబ్బరికాయలు తీసే కార్మికుడు. తల్లి బ్రాండెక్స్లో ఉద్యోగి. వీరికి 12 ఏళ్ల మరో పాప ఉంది. కేసును పట్టణ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.