చిత్ర, శిల్పకళా విమర్శకు చిరునామా
కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో శిల్ప చిత్రకళ పరంపర అవిచ్ఛిన్నమైనది. చిత్రకళనే వృత్తిగా భావించి దానినే అంటిపెట్టుకుని జీవనం సాగించిన ‘నకాషి’ సామాజిక వర్గం తెలంగాణలో ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ శతాబ్దాల తరబడి చిత్రకళకు కేంద్రం. ఈ క్రమంలో చిత్ర శిల్పకళా చరిత్రనూ, అందులోని పరిణామ క్రమాన్నీ అధ్యయనం చేసి, వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించిన రచయిత, చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు.
1950 నుంచి 90 వరకు ఆయన 37 వ్యాసాలు రాశారు. అవి ‘చిత్ర, శిల్పకళా రామణీయకము’ పేరుతో 2009లో పుస్తకంగా వెలువడ్డాయి.
కాకతీయుల అలంకరణ కళ, తెలంగాణలో పటచిత్ర కళ, గోడచిత్ర కళతోపాటు, ఒక వ్యక్తి చిత్రకారుడిగా మారే క్రమంలో అనుభవించే మానసిక పరిస్థితిపై, నేటికాలాన చిత్రకళారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కొండపల్లి వ్యాసాలు రాశారు. తెలంగాణ చరిత్రలో ‘దక్కన్ కలాం’పై రాస్తూ అందులోని భిన్నదశలను ప్రస్తావించారు. సాధారణంగా తన సమకాలీనుల ప్రతిభ గురించి ఏ చిత్రకారుడూ రాయడు. కాని ఆయన పీటీ రెడ్డి సహా కాపు రాజయ్య, అంట్యాకుల పైడిరాజు, ముస్లిం చిత్రకారణి కమలేష్ ప్రత్యేకతలేమిటో తెలిపారు. రాజకీయ నాయకురాలిగానే తెలిసిన సంగెం లక్ష్మీబాయమ్మను చిత్రకారిణిగా పరిచయం చేశారు. ఆదిమకళతో మొదలై, ఆధునిక సర్రియలిస్టు ప్రక్రియ ప్రస్తావనతో పుస్తకం ముగుస్తుంది. (జనవరి 27న కొండపల్లి శేషగిరిరావు జయంతి)
సామిడి జగన్రెడ్డి
8500632551