ఖాళీబిందెలతో రాస్తారోకో
– కొందుర్గులో రెండు గంటల పాటు ఆందోళన
– నీటి సమస్య తీర్చాలని రోడ్డెక్కిన గ్రామస్తులు
– భారీగా నిలిచిన వాహనాలు
– వారంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం : అధికారులు
కొందుర్గు : గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తు సోమవారం మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో గ్రామస్తులు రోడ్డెక్కారు. మహిళలు ఖాళీబిందెళతో రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బోయ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామంలోనే నీటి సమస్య ఇలా ఉంటే పట్టించుకునేవారే కరువయ్యారని ఆరోపించారు. కొందుర్గు గ్రామానికి పక్కనే ఉన్న పరిశ్రమల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి.. కాని కొందుర్గులో తాగడానికి మంచి నీళ్లు దొరకని దుస్థితి నెలకొందన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో తీవ్ర నీటి సమస్య నెలకొన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నీటి సమస్య తీర్చేవరకు కదిలేదిలేదని బీష్మించుకొని కూర్చున్నారు. దీంతో తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ యాదయ్య, ఈఓఆర్డీ యాదగిరిగౌడ్ పంచాయతీ కార్యదర్శి అనూష, వీఆర్ఓ శ్రావణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ యాదయ్య గ్రామస్తులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మానమ్మ, బీజేపీ నాయకులు ప్రేమ్‌కుమార్, సత్యనారాయణ, శేఖర్, శ్రీశైలం, శ్రీనన్న యువసేన నాయకులు శ్రీకాంత్, బీఎస్పీ నాయకులు రామస్వామి తదితరులు ఉన్నారు.