మావోయిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!
సాక్షి, అసిఫాబాద్: కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. దీంతో తప్పించుకున్న మావోయిస్టుల గురించి 25 స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ అడవి మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. 15 పోలీస్ పార్టీలతో గ్రామాలను తనిఖీ చేస్తూ గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై నిఘా ఉంచి పరిశీలిస్తున్నారు. మరో 20 పోలీస్ పార్టీలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని ప్రదేశాల్లో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నార్త్ జోన్ ఐజీ ఈ కూంబింగ్ ఆపరేషన్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (మన్యంలో అలజడి..)
మావోయిస్టులకు సహకరించిన కోవ అనంతరావు నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకుని గురువారం జైలుకు పంపించారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సహాయం చేసిన వారిని గుర్తించి వారిపై నిఘా పెట్టారు. మావోల గురించి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి తగిన బహుమతులు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టుల గురించి నార్త్ జోన్ ఐజీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉత్తరాన ఉలికిపాటు..!)