Jayamma Panchayathi: అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్ హీరోగా..
కొరాపుట్ (ఒడిశా): మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన యువకుడు టాలీవుడ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. కొరాపుట్ జిల్లా నారాయణపట్న సమితిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బైరాగి పంచాయతీ రిటైర్డ్ పీఈఓ కె.హరీష్చంద్ర చౌదరీ, గాయత్రీ కుమారుడు దినేష్ తెరగేట్రం చేస్తున్నాడు. ‘జయమ్మ పంచాయతీ’ అనే తెలుగు చిత్రంలో హీరోగా నటించాడు. వర్ధమాన నటి శాలినీ హీరోయిన్గా, స్టార్‌యాంకర్ సుమా కనకల తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ విజయ్ కలివారపు దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బలగ ప్రకాష్‌రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఎంఎం కీరవాణీ సంగీతం అందించిన ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.
దినేష్ స్వగ్రామం జిల్లాలోని మారుమూల అటవీప్రాంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండలో ఉన్న తాత గారింట్లో పుట్టి, పెరిగాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తితో బీటెక్ పూర్తి చేసి, అవకాశాల కోసం 2013లో హైదరాబాద్ వెళ్లాడు. సుమారు 8 ఏళ్లు అనేక అడిషన్లలో పాల్గొన్నప్పటికీ అవకాశాలు లభించలేదు. చివరికి నూతన దర్శకుడు విజయ్‌కుమార్ కొత్త నటీ, నటులతో జయమ్మ పంచాయతీ సినిమా తీయాలనే అన్వేషిస్తుండగా దినేష్‌కు అవకాశం దక్కింది. అంతకుముందు దినేష్ 2సీరియళ్లలో నటించాడు. ప్రస్తుతం హీరోగా అవకాశం రావడంతో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న బైరగి గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది.
చదవండి: (మరోసారి వార్తల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్)
అగ్రతారల సహకారం..
విలేజ్ డ్రామాగా తెరకెక్కిన జయమ్మ పంచాయతీ సినిమా దాదాపుగా చిత్రకరణ పూర్తి చేసుకుంది. టాలీవుడ్ పాపులర్ యాంకర్ సుమ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 2021 దీవపాళి సందర్భంగా విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. అలాగే నేచురల్ స్టార్ నానీ సినిమాలోని మొదటి పాట ‘తిప్పగలనా?’ లిరికల్ వీడియోను హీరో దినేష్, చిత్ర యూనిట్ సమక్షంలో ఇటీవల విడుదల చేశారు. ఇందులో గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు.
ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆకట్టుకుంటోంది. అనుష్‌మార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. దీంతో హిట్ ఖాయమని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దినేష్ సొంత జిల్లా కొరాపుట్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. తమ ప్రాంతానికి చెందిన యువకుడి చిత్రం టాలీవుడ్లో అద్భుత విజయం సాధించాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.