ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే
ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే
మాస్టర్‌మైండ్స్ విద్యార్థికి ప్రథమ ర్యాంక్
గుంటూరు, న్యూస్‌లైన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థి కోట లీలా నాగకుమార్ అఖిలభారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. మాస్టర్‌మైండ్స్‌లో చదివిన ఈ విద్యార్థి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాసి. తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించగా, తల్లి సుభాషిణికిళ్లీషాపు నడుపుతూ పిల్లలను పెంచి పెద్ద చేసింది.
పదో తరగతి వరకూ గుంటూరులోని వేణుగోపాల్ నగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో చదివిన నాగకుమార్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని మాస్టర్‌మైండ్స్ సంస్థలో చేరాడు. కాగా తమ విద్యార్థి అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల మాస్టర్‌మైండ్స్ సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ శుక్రవారం ఆనందం వెలిబుచ్చారు. మున్సిపల్ స్కూల్లో చదివిన విద్యార్థికి తాము జూనియర్ ఇంటర్ మొదలు ఎంఈసీ, సీఏ-సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ వరకూ ఉత్తమ శిక్షణతో క్వాలిఫైడ్ సీఏగా తీర్చిదిద్దామన్నారు.
నాగకుమార్‌కు ఐసీఏఐ సంస్థ మూడు ప్రతిభా పురస్కారాలు ప్రకటించిందన్నారు. వి.శ్రీనివాసన్ స్మారక బంగారు పతకం, ఇందుమతి తలాటి రజత పతకం, సుభాష్ ఆధ్య స్మారక నగదు బహుమతులను ఏప్రిల్ 8న కోల్‌కతాలో బహూకరించనున్నారన్నారు. గతేడాది క్వాలిఫైడ్ సీఏగా బయటకు వెళ్లిన విద్యార్థి నాగకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో అకౌంటెంట్ ఇన్ ట్రైనీగా చేరాడన్నారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ. 6 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు.