Kothagudem Agency
-
ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు
కొత్తగూడెం రూరల్ : ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీతక్క (ధనసరి అనసూయ)ను పోలీసులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన రేగళ్ల గ్రామంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే శనివారం ఉదయం బయలుదేరారు. టేకులపల్లి మీదుగా వస్తున్న ఆమెను రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నిలువరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి అనుమతి లేదని చెప్పడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ విషయంపై సీఐ అశోక్‌ను వివరణ కోరగా.. రేగళ్ల ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని, పైగా నిత్యావసర వస్తువుల పంపిణీకి అనుమతి లేని కారణంగా రేగళ్లకు వెళ్లనీయలేదని తెలిపారు. కాగా, లాక్డౌన్ సమయంలో గిరిజిన గ్రామాల్లోని ప్రజలకు సీతక్క నిత్యావసరాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళుతూ.. వారి ఆకలి తీరుస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె కాలికి చిన్నపాటి గాయం కూడా అయింది. అయితే ప్రస్తుతం పోలీసులు సీతక్కను అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చదవండి : ‘సీతక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు..’ -
కొత్తగూడెం ఎన్నికల్లో కార్మికులే కీలకం
సాక్షి, కొత్తగూడెం: ఏజెన్సీలో ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలో ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉండగా, ఇందులో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందులో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో మొత్తం 35, 647 ఉద్యోగ, కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సింగరేణి, అశ్వాపురం మండలంలో భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలంలో ఐటీసీ పేపర్ బోర్డ్ ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, కొత్తగూడెంలో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు తమ అనుబంధ కార్మిక సంఘాల సహకారంతో కార్మిక వాడల్లో విస్తృతంగా చారం చేస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1.20 లక్షలకు పైగా కార్మిక కుటుంబాల ఓట్లు ఉండడంతో వాటిని రాబట్టేందుకు యూనియన్ల అగ్ర నాయకులను సైతం ప్రచార పర్వంలోకి దింపుతున్నారు. కార్మిక హక్కులు, సౌకర్యాలు, భద్రత, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు, సింగరేణిలో హైపవర్ వేతనాలు తదితర అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. మణుగూరు మండలంలో ఉన్న సింగరేణి కార్మిక వాడల్లో 2, 819 కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో 2 వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్‌లో 1,500 మంది ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్‌బోర్డు కర్మాగారంలో 1,600 మంది ఉద్యోగులు, 800 మంది అధికారులు, మరో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. నియోజకవర్గంలో అన్నీ కలిపి 17,019 కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కార్మికు కుటుంబాల ఓట్లు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. ఇక్కడ 1,023 సింగరేణి కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లు స్వల్ప ప్రభావం చూపించనున్నాయి. త్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్, ఎన్ఎండీసీ, సింగరేణి కార్మిక కాలనీలు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా సింగరేణిలో 3, 667 కార్మిక కుటుంబాలు ఉండగా, కొత్తగూడెం కార్పొరేట్లో 2,418 ఉద్యోగుల కుటుంబాలు ఉన్నా యి. మరో 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పాల్వంచ మండలంలోని నవభారత్‌లో 1,550 మంది కార్మికులు, ఎన్ఎండీసీలో 270 మంది ఉన్నారు. ఇక కేటీపీఎస్‌లో అన్ని యూనిట్లలో కలిపి 5,700 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం కలిపి కొత్తగూడెం నియోజకవర్గంలో 16,605 మంది కార్మికులు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాల ఓట్లు గెలుపోటములను బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్ల కోసం కార్మిక ఆవాసాల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. -
తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది
డీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో విరసం నేత వరవరరావు నల్లగొండ టూ టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దొరల పాలన నడుస్తోందని విరసం నేత వరవరరావు ధ్వజ మెత్తారు. నల్లగొండలో జరుగుతున్న డీటీఎఫ్ విద్యా వైజ్ఞానిక నాలుగో రాష్ట్ర సభలు సోమవారం ముగిశాయి. చివరిరోజు ముఖ్యఅతి«థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌సహా ఆ నాలుగు కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ పాలన వరకు ఎవరూ వ్యవహరించని విధంగా విమలక్కను, కార్యకర్తలను బయటకు వెళ్లగొట్టి అరుణోదయ సాంస్కృతిక కార్యాల యాన్ని మూసివేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. 1996లో కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశాలు పాటించి సమైక్య రాష్ట్రానికి సీఈవోగా వ్యవహరించిన చంద్ర బాబు రాష్ట్రంలో నెత్తుటేరులు పారించాడన్నారు. కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో ఓ గోండు యువకుడు సింగరేణిలో ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైతే.. అతడిని ఉద్యోగంలో చేరవద్దని వేధించారని చెప్పారు. సదరు యువకుడు ఆగస్టులో విజయవాడలో జరిగిన సివిల్ పరీక్షకు వెళ్లి నేటికీ తిరిగి రాలేదన్నారు. మెరిట్లో అతడి తర్వాత ఉన్న వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోందన్నారు. కరెన్సీ రద్దు తర్వాత పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కాషాయీకరణ, విద్య వ్యాపారీకరణను వ్యతిరేకించి కామన్ విద్య కోసం ఉద్యమించాలని వరవరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టప్ప, జ్వాల సంపాదకుడు గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.