కొత్తగూడెం
సాక్షి, కొత్తగూడెం: ఏజెన్సీలో ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన భద్రాద్రి జిల్లాలో ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాలు ఉండగా, ఇందులో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందులో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో మొత్తం 35, 647 ఉద్యోగ, కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో సింగరేణి, అశ్వాపురం మండలంలో భారజల కర్మాగారం, బూర్గంపాడు మండలంలో ఐటీసీ పేపర్ బోర్డ్ ఉన్నాయి. ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్‌ఎండీసీ, కొత్తగూడెంలో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు తమ అనుబంధ కార్మిక సంఘాల సహకారంతో కార్మిక వాడల్లో విస్తృతంగా చారం చేస్తున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1.20 లక్షలకు పైగా కార్మిక కుటుంబాల ఓట్లు ఉండడంతో వాటిని రాబట్టేందుకు యూనియన్ల అగ్ర నాయకులను సైతం ప్రచార పర్వంలోకి దింపుతున్నారు. కార్మిక హక్కులు, సౌకర్యాలు, భద్రత, కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు, సింగరేణిలో హైపవర్ వేతనాలు తదితర అంశాలు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి.
పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. మణుగూరు మండలంలో ఉన్న సింగరేణి కార్మిక వాడల్లో 2, 819 కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో 2 వేల మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్‌లో 1,500 మంది ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పేపర్‌బోర్డు కర్మాగారంలో 1,600 మంది ఉద్యోగులు, 800 మంది అధికారులు, మరో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. నియోజకవర్గంలో అన్నీ కలిపి 17,019 కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ కార్మికు కుటుంబాల ఓట్లు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో సింగరేణి కార్మిక వాడలు ఉన్నాయి. ఇక్కడ 1,023 సింగరేణి కార్మిక, అధికారుల కుటుంబాలు ఉంటున్నాయి. మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికుల ఓట్లు స్వల్ప ప్రభావం చూపించనున్నాయి. త్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్, ఎన్‌ఎండీసీ, సింగరేణి కార్మిక కాలనీలు ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా సింగరేణిలో 3, 667 కార్మిక కుటుంబాలు ఉండగా, కొత్తగూడెం కార్పొరేట్‌లో 2,418 ఉద్యోగుల కుటుంబాలు ఉన్నా యి. మరో 3,500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. పాల్వంచ మండలంలోని నవభారత్‌లో 1,550 మంది కార్మికులు, ఎన్‌ఎండీసీలో 270 మంది ఉన్నారు. ఇక కేటీపీఎస్‌లో అన్ని యూనిట్లలో కలిపి 5,700 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం కలిపి కొత్తగూడెం నియోజకవర్గంలో 16,605 మంది కార్మికులు ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో కార్మిక కుటుంబాల ఓట్లు గెలుపోటములను బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల ఓట్ల కోసం కార్మిక ఆవాసాల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment