'కొత్తకోట' అత్యాచార నిందితులపై నిర్భయ కేసు నమోదు
కొత్తకోట బస్టాండ్‌లో ఈ రోజు తెల్లవారుజామున మహిళపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులైన హోంగార్డ్, కానిస్టేబుల్లను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు.
అడ్డాకుల మండలం కందూరు గ్రామానికి చెందిన మహిళ... కర్నూలులో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి .... అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్ లో దిగింది. బస్టాండ్ లో సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు.... ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కొత్తకోట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌తోపాటు మరో ఇద్దరు యువకులు కూడా ఆ మహిళను బెదిరించి లైంగిక చర్యకు పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ ఈ రోజు ఉదయం పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.