బౌద్ధానికి కీలకం ‘కొత్తపల్లి స్తూపం’
పురావస్తు శాఖ ఎపిగ్రఫీ డెరైక్టర్ రవిశంకర్
తొండంగి: ఆంధ్ర రాష్ట్రంలో బౌద్ధమత వ్యాప్తికి సంబంధించి అతి ముఖ్యమైన స్తూపం ఎ.కొత్తపల్లి మెట్టపై బయల్పడటంతో ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని మైసూర్‌లోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ (ప్రాచీన శిలాశాసనాలపై ఉన్న రాతల అధ్యయనం) విభాగం డెరైక్టర్ టి.ఎస్.రవిశంకర్ అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఎ.కొత్తపల్లి మెట్టపై పురావస్తుశాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాల్లో బయల్పడిన శాసనాధారాలను ఎపీగ్రఫీ విభాగం బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ... మన చరిత్రకు సంబంధించి 70 వేల శాసనాలు తమ విభాగానికి లభించాయన్నారు. ప్రకాశం జిల్లాలో కాకతీయులవి, చిత్తూరు, కడప జిల్లాల్లో హంపీ విజయనగరం కాలం నాటి శాసనాలు లభించాయన్నారు.