ఊపిరి ధారపోసి..
కుటుంబ పోషణకు సౌదీ వెళ్లిన కొత్తపేట వాసి
నిర్జీవంగా తిరిగొచ్చి.. కుటుంబానికి మిగిల్చిన విషాదం
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. బిడ్డలు ఎదుగుతున్నారు. వారికి మంచి జీవనాన్ని అందించాలి. ఇదే ఆమెను నిత్యం వేధిస్తున్నాయి. దీంతో ఓ నిర్ణయానికి వచ్చింది. కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే.. పొట్టకూటి కోసం విదేశానికి వెళ్లాలని సంకల్పించింది. ఏడాది క్రితం సౌదీ వెళ్లిన ఆమె నిర్జీవమై స్వగ్రామానికి తిరిగొచ్చింది. ఆ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.
– కొత్తపేట
కొత్తపేట శివారు రామారావుపేటకు చెందిన కముజు విమలకు భర్త అర్జునరావు, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. గత ఏడాది జూన్ 15న ఉపాధి కోసం సౌదీ వెళ్లింది. ఆరు నెలల పాటు భర్తకు సక్రమంగానే సొమ్ము పంపించింది. ఏమైందో, ఏమో తర్వాత నుంచి డబ్బు పంపలేదు. ఈ ఏడాది జూన్ 16న అర్జునరావు ఆమె పనిచేసే ఇంటి యజమానికి ఫోన్లో ఆరా తీశాడు. ‘విమల మాకు పనిచేయదు. ఇండియాకు పంపించేస్తున్నాం’ అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. అయినా విమల తిరిగి రాలేదు. ఆమెకు ఏమైందో, ఎక్కడుందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఇలాఉండగా ఈ నెల 2న స్థానిక తహసీల్దార్ వచ్చి.. ‘ఆమె చనిపోయిందట, మృతదేహం వచ్చిందా?’ అని అడిగారు. దీంతో విమల కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎట్టకేలకు విమల మృతదేహం శుక్రవారం రాత్రి కొత్తపేటకు చేరుకుంది.
అనారోగ్యంతో మరణం!
ఇలాఉండగా విమల మృతిపై సందిగ్ధత నెలకొంది. అదే గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ములగలేటి బంగారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూన్ 16న విమలను సౌదీ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కించగా, దుబాయ్లో మరో విమానం మారాల్సి ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో దిగాక విమల అనారోగ్యానికి గురికావడంతో, అక్కడి సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొందాక ఆమె మరణించింది. అప్పటి నుంచి ఆమె మృతదేహం అక్కడే మార్చురీలో ఉంది. విచారణ అనంతరం ఆమె మృతదేహాన్ని శుక్రవారం విశాఖపట్నం ఎయిర్పోర్టుకు తరలించగా, అక్కడి నుంచి కొత్తపేటకు పంపించారు.
కుటుంబ సభ్యుల రోదనలు
‘మా కోసం ఉపాధికి వెళ్లి తిరిగిరాకుండా పోయావా’ అంటూ విమల కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఇక్కడ కూలీ పనిచేసే విమల తన కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం దేశం విడిచి వెళ్లిందని, స్వదేశానికి చేరకుండానే చనిపోయిందంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు.