‘రెక్కల కష్టం’ దోచుకున్నారు..
* పంట అమ్మిన డబ్బు చోరీ
* రైతు జేబు కత్తిరించిన దొంగలు
సుల్తాన్‌బజార్: ఆరుగాలంపడిన కష్టం దొంగలపాలైంది. కుటుంబీకులతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను విక్రయించగా వచ్చిన సొమ్మును జేబుదొంగలు అపహరించారు.ఈ సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్ఐ పవన్ కథనం ప్రకారం.. పూడూరు మండలం చైలాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల గోపాల్‌రెడ్డి(57) ఖరీఫ్‌లో పండించిన మక్కలను సంతోష్‌నగర్‌లోని వ్యాపారికి విక్రయించాడు.గురువారం నగరానికి వచ్చి రూ. 95 వేలు తీసుకున్నాడు.
అక్కడి నుంచి అబిడ్స్ వచ్చి ఓ దుకాణంలో చెప్పులు కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు అబిడ్స్ నుంచి కోఠి బయలుదేరాడు. కాగా, అతడిని ఆటోలో అనుసరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు జేబు కత్తిరించి రూ.95 వేలు అపహరించారు. కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద విషయం తెలుసుకున్న గోపాల్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. తర్వాత తేరుకొని సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.