నేడు పత్తికొండలో ‘సమైక్య శంఖారావం’
పత్తికొండ టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకుడు, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విభజన కుట్రను వ్యతిరేకిస్తున్నది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోరాడుతున్నారన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడా కూడగడుతున్నట్లు చెప్పారు.
సీమాంధ్రలోని ఎమ్మెల్యేలంతా విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యతకు మద్దతుగా రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పిస్తే విభజనను అడ్డుకోవచ్చని తమ నేత పిలుపునకు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక ఊరివాకిలి సమీపంలోని ముత్యాలశెట్టి గోడౌన్లో నిర్వహించనున్న శంఖారావం సభకు పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. సమైక్యవాదులంతా సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.
సమావేశంలో కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ ఎస్.రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సి.శ్రీరంగడు, మాజీ జెడ్పీటీసీ పి.శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జి.సోమశేఖర్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు పి.శ్రీనివాసరెడ్డి, అడ్వకేట్లు దామోదరాచారి, పందికోన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.