మోదీ నిర్ణయంతో 30 ఏళ్లు వెనక్కి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
పెనుకొండ : పెద్దనోట్లు రద్దు చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణయం దేశ ప్రగతిని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని, పేదలు అనేక ఇబ్బందులు పడుతుంటే,..ఇది పెద్దలకు అదృష్టంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో అల్లకల్లోలం సృష్టించిందని, 130 కోట్ల దేశ ప్రజల్లో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారన్నారు. వీరు నోట్ల రద్దు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగదు రహిత లావాదేవీలు వల్ల సైబర్ నేరాలు భారీగా పెరగనున్నాయన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోపిడీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పోలవరం, హంద్రీనీవా వైఎస్ హయాంలో అయినవేనని, టీడీపీ ప్రభుత్వం తామే చేస్తున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా వెనుకబడిన రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రెయిన్ గన్ల పేరుతో రూ. 300 కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని విమర్శించారు. టీడీపీ ప్రవేశపెట్టిన నీరుచెట్టు, జన్మభూమి కార్యక్రమాలు ప్రజల కోసం కాదని కార్యకర్తల లాభార్జనకేనన్నారు. రాయల ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ చేయడాన్ని చూసి తెలుగుదేశం కళ్లు తెరవడం మంచి పరిణామమన్నారు. కొండపై జరగాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటాసత్యం, డీసీసీ కార్యదర్శి కేటీ శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు జీసీ వెంకటరాముడు, న్యాయవాది సుదర్శనరెడ్డి, కన్వీనర్ చంద్రకాంతమ్మ, పీఆర్ఓ మహేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.