దేవుడే ఆగ్రహిస్తే...?
కంటికిరెప్పలా కాపాడాల్సినవాడే భక్తులపై అలక పూనాడా.., సమాధానం అవునో కాదో గానీ, రథోత్సవంలో రక్తం చిందింది. సుమారు ఆరంతస్తుల ఎత్తున్న తేరు భక్తుల మీదికి విరిగిపడింది. వేడుకల నడుమ ఇలా జరిగిందేమిటా అని అందరూ ఖిన్నులయ్యారు.
బళ్లారి: శ్రీ గురు కొట్టూరేశ్వర మహా రథోత్సవంలో అపశ్రుతి దొర్లింది. మంగళవారం సాయంత్రం బళ్లారి జిల్లా కూడ్లిగి నియోజకవర్గ పరిధిలోని కొట్టూరు పట్టణంలో కొట్టూరేశ్వర మహా రథోత్సవంలోనే విషాదం ఒలికింది. రథోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్త జనం పెద్దసంఖ్యలో వస్తారు. 16వ శతాబ్దంలో శ్రీ కొట్టూరేశ్వర మహాస్వామీజీ వెలసిన ఈ ప్రాంగణంలో అప్పటినుంచి ప్రతి ఏటా మహారథోత్సవం మాఘమాసంలో జరగడం ఆనవాయితీ. తేరు నిర్వహణకు కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రథం లాగి తిరిగి అదే ప్రదేశంలో పెడుతున్న సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. వేలాది మంది భక్తులు రథం చుట్టూ గుమిగూడి ఉండగా తేరు చక్రాలపై నుంచి విరిగిపడింది. రథం లోపల ఉన్న పూజారితో సహా 15 మంది గాయాలపాలైయ్యారు. భక్తులు రథం శిథిలాల కింద ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీయడానికి జనం ఇబ్బందులు పడ్డారు. బాధితుల తల, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రథం లాగే సమయంలో మామూలుగా విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. బాధితులు, వారి బంధువుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం ఏర్పడింది.
జిల్లాధికారి రామ్ ప్రశాత్ మనోహర్‌తో సహా సంబంధిత అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్రేన్ సాయంతో శిధిలాల తొలగింపు తదితర సహాయక చర్యలు చేపట్టారు. పలువురు బాధితుల్ని హెలికాప్టర్లో బళ్లారి ఆస్పత్రులకు తరలించారు.