koudipalli
-
లాక్డౌన్ వేళ.. ఏఈఓ హోంవర్క్
సాక్షి, నర్సాపూర్ : లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సైతం పలువురు అధికారులు తమదైన రీతిలో ఆఫీస్ పనులు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మట్టి నమూనాలు సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో గ్రామంలో సేకరించిన మట్టి నమూనాలను సేకరించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న ఏఈఓ ప్యాకెట్లలో రైతుల పేర్లు, సర్వే నంబర్ ఇతర వివరాలను చీటిపై రాసి సేకరించిన మట్టిని ప్యాకెట్లలో భద్రపరిచారు. సేకరించిన మట్టి నమూనాలను ల్యాబ్‌కు పంపించనున్నట్లు ఈ మేరకు ఆయన పేర్కొన్నారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయడంవల్ల ఖర్చు తగ్గుతుందని సూచనలు చేశారు. (లాక్డౌన్ : విషం పెట్టి కోతులను చంపారు) -
‘మినీ’ని సుందరంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి పెద్దచెరువు మినీట్యాంక్‌బండ్‌పై అందమైన మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దుతామని డీపీఓ హనూక్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లిని దత్తత తీసుకున్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్స్ సుజీంద్ర, దిలీప్‌దాస్‌తో కలిసి డీపీఓ హనూక్ మినీ ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలమేరకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మండలాన్ని దత్తత తీసుకుందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు కౌడిపల్లి గ్రామంలో మొక్కలు నాటడంతోపాటు వాటికి రక్షణ కల్పిస్తుందన్నారు. ట్యాంక్‌బండ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా మొక్కలు సైతం పెంచనున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ చర్యలు చేపట్టి నీరు పోయడంతో పాటు కాపలా ఏర్పాటు చేస్తామన్నారు. కట్టపై అందంగా మొక్కల పెంపకం.. కట్టపై అందంగా కనిపించే పూల మొక్కలు నీడనిచ్చే మొక్కలు పెద్దగా పెరిగే వివిధ రకాల మొక్కలను నాటుతామని తెలిపారు. అనంతరం ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రతినిధి సుజీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ట్యాంక్‌బండ్‌నూ పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు సూచనలు ఖర్చు అంచనాలను కంపెనీకి సమర్పించిన అనంతరం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటిలింగం, ఏపీఓ శ్యాంకుమార్, ఈసీ ప్రేంకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పిశ్కె శెట్టయ్య, చంద్రం దుర్గాగౌడ్ పాల్గొన్నారు. -
‘ఫిట్స్’తో గజగజ..
కౌడిపల్లి: మెదక్ జిల్లాలోని రెండు గ్రామాలు, ఓ తండా ఫిట్స్‌తో గజగజలాడుతున్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో వణికించిన ఈ జబ్బు తిరిగి అలజడి రేపుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కౌడిపల్లి మండలంలోని భుజిరంపేట, వెంకటాపూర్‌లతో పాటు మరో తండాలో ఫిట్స్‌తో గత 15 రోజుల్లో 40 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది ఇదే రోజుల్లో.. గతేడాది ఇవే గ్రామాల్లో పలువురికి ఫిట్స్ వచ్చాయి. అప్పటి కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నాయంటూ, మైకం కమ్మి కిందపడిపోతున్నారు. గాయాలకు గురవుతున్నా తెలియనంతగా సొమ్మసిల్లిపోతున్నారు. 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఏమీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితికి గురవుతున్న వారి ప్రవర్తనను బట్టి ఫిట్స్‌గా భావించి పక్కనున్న వారు బాధితుల చేతిలో తాళాలు పెట్టడం, నుదుటపై వేలితో ఒత్తడం వంటివి చేస్తున్నారు. ఫిట్స్‌తోనే మృతి చెందాడు! వెంకటాపూర్‌కి చెందిన ఒడిగంటి భిక్షపతి (42) గత సోమవారం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా నీటికుంటలో బోర్లాపడిఉన్నాడు. ఫిట్స్ రావడంతోనే కుంటలో పడి మృతిచెందాడని గ్రామస్తులు అంటున్నారు. తనకు అనారోగ్యమంటే తెలియదని, కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి కిందపడిపోయానని, అరగంట తరువాత కోలుకున్నానని వెంకటాపూర్‌కి చెందిన పుట్టి వెంకటేశం తన అనుభవాన్ని చెప్పాడు. ఎంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి భుజిరంపేట, వెంకటాపూర్ గ్రామాల్లో బాధితుల్ని గురువారం కౌడిపల్లి పీహెచ్‌సీకి తరలించారు. సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీపీ తెలిపారు. 2 గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆందోళన వద్దు..వైద్యపరీక్షలు నిర్వహిస్తాం భుజిరంపేట, వెంకటాపూర్‌లలో పలువురు ఫిట్స్‌కు గురవుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆందోళన అవసరం లేదని డీఎంఅండ్‌హెచ్‌ఓ బాలాజీపవార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన కౌడిపల్లి పీహెచ్‌సీని సందర్శించారు. ఫిట్స్‌తో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
అభ్యర్థుల్లో ఉత్కంఠ
కౌడిపల్లి, న్యూన్లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు టికెట్ వస్తుందా లేదోననే ఉత్కంఠకు గురవుతున్నారు. మండలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఆయా పార్టీల నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అ భ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా రిజర్వేషన్లు కలిసిరాక కొందరు వెనక్కి తగ్గగా అనుకూలించిన వారు పోటీ చేయాలని భావిస్తున్నా సొంత పార్టీలోనే పోటీ తీవ్రంగా ఉండడంతో బీ-ఫారం వస్తుం దా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. మండల పరిషత్ అధ్యక్ష పదవి బీసీ మహిళకు, జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 15 కాగా ఇందులో ఎనిమిది మహిళలకు, ఏడు స్థానాలు పురుషులకు రిజర్వు అయ్యాయి. కొనసాగుతున్న కసరత్తు.. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్ఎస్ తరఫున జిల్లా నాయకుడు మధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీల మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆశావహులు అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఒక్కో స్థానానికి ఒకే పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు పోటీపడుతుండడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జెడ్పీటీసీ టికెట్ కోసం.. జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థి ఎంపిక కూడా ప్రధాన పార్టీలకు సమస్యగా మారింది. సీనియర్ నాయకులు, కొత్తగా వచ్చిన వారు, పార్టీకి దూరంగా ఉన్నవారు సైతం టికెట్లను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు సంగాగౌడ్, ఎంపీపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు గండి యాదాగౌడ్, విశ్వంబరస్వామి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌లు తమ కుటుంబ సభ్యులకే కేటాయించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, మహిళ నాయకురాలు అనిత ఓంప్రకాశ్, కౌడిపల్లి మాజీ సర్పంచ్ మంజుల శివాంజనేయులు ఆశిస్తున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్ తన కుటుంబ సభ్యులను పోటీలో దింపాలని చూస్తున్నా. అయితే ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఎవరైనా వస్తే వారికి అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. -
నేటినుంచి సంగమేశ్వర స్వామి జాతర
కౌడిపల్లి, న్యూస్‌లైన్: మండలంలోని కొట్టాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంగమేశ్వర స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ బెంది లత రమేష్‌గౌడ్ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 16న బండ్ల ఊరేగింపు, 17న అగ్ని గుండాలు తొక్కుట, పాచి బండ్ల ప్రదర్శన, ఒగ్గుకథ, 18వ తేదీ రాత్రి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.