kovru
-
ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్‌కు సతీష్‌కుమార్ ఎంపిక
► రూ.12 లక్షలకు కొనుగోలు చేసిన జట్టు యాజమాన్యం ►జూలైలో జరిగే ఐదో సీజన్లో పాల్గొనే అవకాశం కొడవలూరు (కోవూరు) : ప్రొ కబడ్డీ పాట్నా పైరేట్స్ జట్టుకు కోవూరుకు చెందిన పూనుగుంట సతీష్‌కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో ముంబైలో జరిగిన బహిరంగ ఆక్షన్‌లో పాట్నా పైరేట్స్ జట్టు యాజమాన్యం రూ.12 లక్షలకు సతీష్‌ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగే ఐదో సీజన్ ప్రొకబడ్డీ పోటీల్లో పాల్గొనే పాట్నా జట్టుకు డిఫెండర్‌గా సతీష్ ఎంపికయ్యారు. నాలుగో సీజన్లో బెంగళూరు బుల్స్ జట్టులో స్థానం దక్కించుకున్న సతీష్ ఈసారి పాట్నా పైరేట్స్ జట్టు నుంచి బరిలో దిగుతున్నాడు. సతీష్ 20కి పైగా జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి పాల్గొని బహుమతులు సాధించాడు. జూనియర్స్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. క్రీడా కోటాలో రైల్వేలో టీటీఐ ఉద్యోగం సాధించిన సతీష్‌కుమార్ ఆ తర్వాత రైల్వేస్ జట్టుకు ఎనిమిదిసార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్ సాక్షితో మాట్లాడుతూ ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఈ ప్రభాకర్, వీర్ల వెంకయ్యల ప్రోత్సాహంతోనే తాను ఈస్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కాగా సతీష్ ఎంపిక పట్ల క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు. పోటీల్లో రాణించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాక్షించారు. -
కుమార్తెతో కలిసి గర్భిణి ఆత్మహత్య
► వరకట్న వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు కోవూరు: తన మూడేళ్ల కుమార్తెతో కలిసి నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కోవూరులోని కోనమ్మతోటలో శనివారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం మేరకు.. కొడవలూరు మండలం రామన్నపాళెంకు చెందిన చెంతాటి వెంకటరమణయ్య, సుధామణి దంపతుల కుమార్తె అనుచందన (20)కు కోవూరు కోనమ్మతోటక చెందిన జ్యోతి శంకర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఆ సమయంలో రూ.3 లక్షల నగదు, 30 సవర్ల బంగారంతో పాటు రెండు కేజీల వెండి వస్తువులను కట్నంగా అందజేశారు. అదనంగా రూ.80 వేల విలువ చేసే బైక్‌ను కానుకగా కొనిచ్చారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి మూడేళ్ల రుషిక అనే కుమార్తె ఉంది. సుధామణి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం ఆమె వివాహానికి ముందే నుంచే హైదరాబ్‌లోని మల్కాజ్‌గిరికి వలస వెళ్లారు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి అయిన అనుచందన తన కుమార్తె రుషికతో కలిసి నెల క్రితం హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శంకర్ మాత్రం కోవూరులోనే తల్లిదండ్రుల వద్ద ఉన్నాడు. అనుచందన, ఆమె తల్లి సుధామణి, కుమార్తె రుషికతో కలిసి శనివారం ఉదయం కోవూరుకు చేరుకున్నారు. కుమార్తెను అనుచందన, మనుమరాలు రుషికను కోవూరు అత్తారింట్లో వదిలిపెట్టి సుధామణి రామన్నపాళెంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటికే ఏమైందో ఏమో తెలియదు కానీ సుధామణి మార్గం మధ్యలో ఉండగానే అనుచందన, రుషిక ఉరేసుకుని చనిపోయారని శంకర్ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో సుధామణి గుండెలు అదిరేలా రోదిస్తూ తిరిగి కుమార్తె ఇంటికి పరిగెత్తింది.అనుచందన రుషికను తన బెడ్రూంలోకి తీసుకెళ్లి ఉరివేయడంతో పాటు తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్నారు. ఎంత సేపటికి గడి తీయకపోవడంతో శంకర్ కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి తలుపులు పగలుగొట్టారు. విగతజీవులుగా తల్లికుమార్తెలను చూసి గెండెలు పగిలేలా రోదించారు. డబ్బులు ఇస్తేనే ఫోన్లో మట్లాడించేవాడు.. తల్లిబిడ్డ మృతి వివరాలను తెలుసుకున్న సుధామణి బంధువులు రామన్నపాళెం నుంచి కోవూరుకు చేరుకున్నారు. శంకర్‌తో పాటు కుటుంబ సభ్యులే తల్లి, బిడ్డ ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అనుచందన భర్త శంకర్ అడిగినప్పుడు డబ్బులు ఇస్తేనే హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించే వాడని, లేకుంటే ఆ అవకాశమే లేకుండా చేసేవాడని బంధువులు దుమ్మెత్తి పోశారు. హైదరాబాద్ మల్కాజ్గిరి సెంటర్ వంద గజాల స్థలం ఉందని, దాన్ని అమ్మి తనకు డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధించేవాడు. ప్రస్తుతం స్థలం ధర ఎక్కువ లేదని మంచి రేటు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పిన వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మమ్మ నీతో వస్తాను.. హైదరాబాద్ నుంచి తమతో పాటు సింగరాయకొండకు వస్తున్న అనుచందన పెద్దమ్మ శైలజతో తాను నీతో వస్తానని చిన్నారి రుషిక అల్లరి చేసింది. ఆ సమయంలో అనుచందన రుషికను లాలించి బుజ్జగించి కోవూరు తీసుకువచ్చిందని శైలజ చేసిన రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. -
'సాక్షి’ విలేకరిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి
వ్యతిరేక వార్తలు రాస్తే పెట్రోల్ పోసి తగలెడతానంటూ బెదిరింపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు ‘సాక్షి’ స్థానిక విలేకరి జీవీవీ సత్యనారాయణపై సోమవారం సాయంత్రం విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ‘నాకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయంటే నిన్ను, నీ పేపర్‌ను పెట్రోల్ పోసి తగలబెడతా..’ అంటూ బెదిరించారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల ఎంపీటీసీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చూసేందుకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే అధికారులతో మంతనాలు ప్రారంభించారు. అయితే అందుకు అవకాశం లేదని ఎంపీడీవో పి.వసంతమాధురి, ఎన్నికల అధికారి యు.వసంత్‌కుమార్ ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ‘మీతో రహస్యంగా మాట్లాడాలి రండి’ అని ఎన్నికల అధికారిని ఎమ్మెల్యే కోరారు. బయటకు వచ్చిన వారిని అక్కడే ఉన్న ‘సాక్షి’ విలేకరి ఫొటో తీసేందుకు ప్రయత్నించగా, రామారావు అతనిపై అమానుషంగా దాడి చేశారు. ‘ఎంపీటీసీ స్థానానికి మా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యేలా చేసుకుందామని మా తంటాలు మేం పడుతుంటే ఫొటోలు తీస్తావా..’ అంటూ దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దారు. అధికారులు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేను అతి కష్టంగా బయటకు పంపారు. సత్యనారాయణ ఎంపీడీవో కార్యాలయంలోనే ఉండిపోగా, ఎమ్మెల్యే ‘బయటకు రా నా కొడకా.. ఇక్కడే చంపేస్తా’ అని అరుస్తూ మెయిన్ గేటు వద్దే కాపు కాశారు. విలేకరి ఇచ్చిన సమాచారంతో సీఐ ఎన్.చిరంజీవి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో సత్యనారాయణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు దాఖలు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. -
కొవూరు ఏటీఎంలో నగదు చోరీ
నెల్లూరు జిల్లా కొవూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ఓ ఏటీఎంను పగలకొట్టి, అందులో ఉన్న నగదును అపహరించుకుపోయారు. ఆ క్రమంలో ఏటీఎంలోని సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే ఏటీఎంలో దొంగలు ఎంత నగదు అపహరించుకుపోయారు అనేది బ్యాంక్ అధికారులు వస్తే కాని తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.