నర్సింగ్ కాలేజీలో దారుణాలకు పాతర
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేపై విచారణకు తెర
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై నమోదైన కేసును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన కళాశాలలో విద్యనభ్యసించడానికి వచ్చిన కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆయనపై ఆరోపణలన్నాయి. మహిళల ఆత్మాభిమానానికి భంగం కలిగేలా దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణల కింద నిడదవోలు పోలీసు స్టేషన్లో రామారావుపై 2009లో కేసులు నమోదయ్యాయి. నిడదవోలులో ఉన్న టీవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలోని స్పృహ నర్సింగ్ కాలేజీలో వరుస దారుణాలు జరిగినట్లు 2009 జూన్ 18న వెలుగులోకి వచ్చింది.
ఆరోజు రాత్రి కళాశాల హాస్టల్లో కలకలం రేగడం, మేడపైనున్న వాటర్ ట్యాంక్ వద్ద దాక్కున్న టీవీ రామారావును స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మీడి యా సమక్షంలో పట్టుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి నాలుగు రోజుల ముందు ఆ కళాశాలలో చదువుతున్న కేరళ నర్సింగ్ విద్యార్థినితో రామారావు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు, అడ్డుకోబోయిన మరో విద్యార్థినిపై దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో విద్యార్థినులు నాటి హోంమంత్రికి ఫిర్యాదు చేయగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.