మళ్లీ నేపాల్‌లో అస్థిరత
నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి పయనించడం అలవాటైన నేపాల్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం హఠాత్తుగా 275మంది సభ్యులుండే పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. పాలకపక్షం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్)లో గత కొన్నినెలలుగా పుట్టిన ముసలం కారణంగా ప్రతినిధుల సభకు ఇంకా ఏడాది గడువుండగానే ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఓలి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో ఓలి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ...అంటే 174మంది సభ్యుల మద్దతు వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శనీయంగా రెండేళ్లక్రితం ఓలి నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్టు సెంటర్)లు విలీనమై సీపీఎన్గా ఏర్పడ్డాయి. అయితే కలిశాయన్న మాటేగానీ ఆ రెండు సంస్థలూ రెండు వర్గాలుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్లక్రితం ఆమోదం పొంది గణతంత్ర నేపాల్ ఆవిర్భావానికి మూలకారణమైన రాజ్యాంగం ఇలా అర్థాంతరంగా పార్లమెంటు రద్దు చేయడాన్ని అంగీకరిస్తుందా లేదా అన్న అంశంలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో డజను పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీల విలీనంలోనే వివాదం బీజాలున్నాయి. విలీనం సందర్భంగా కుదిరిన ఒప్పందం ఇటీవలికాలం వరకూ రహస్యంగానే వుండిపోయింది. ఓలి, ప్రచండలిద్దరికీ, పార్టీలో మరికొందరికీ మాత్రమే దాని వివరాలు తెలుసు. అందులో ఇద్దరూ చెరిసగం కాలం పాలించాలన్న షరతుంది. సింహాసనం అధిరోహించాక ఓలి దాన్ని మరిచిపోవడమే తాజా వివాదానికి దారితీసింది. భిన్న పార్టీలైనా, సంస్థలైనా విలీనం కావడానికి అనేక కారణాలుంటాయి. ఐక్య సంఘటనగా కలిసి పనిచేస్తున్న క్రమంలో వాటిమధ్య ఏర్పడే సదవగాహన...ఒకే రకమైన సిద్ధాంతాలు లేదా ఆశయాలు వున్నాయన్న అభిప్రాయం...ఉమ్మడిగా సాధించాల్సింది ఎంతోవుందన్న భావన –ఇలా ఏదో ఒక ప్రేరణ వున్నప్పుడే ఏ విలీనమైనా సహేతుకమైనదవుతుంది. కానీ స్వప్రయోజనాలే పరమార్థం అయినప్పుడు పేరుకు విలీనం జరిగినా అది కాస్తా ప్రహసప్రాయంగా మిగులుతుంది.
నేపాల్ కమ్యూనిస్టు పార్టీల కలయిక చివరి బాపతేనని గత కొన్ని నెలల పరిణామాలు చెబుతున్నాయి. ఒప్పందంలోని షరతు బేఖాతరు చేశాక సీపీఎన్లో రాజుకున్న మంటలు చూసి ఓలి మొదట్లో బెంబేలెత్తారు. రాజీ బేరాలు సాగించారు. సీనియర్లతో చర్చోపచర్చలు సాగించి పార్టీ కార్యనిర్వహణాధికారాలను ప్రచండకు కట్టబెట్టడానికి సమ్మతించారు. అది మొదట్లో కొన్నాళ్లు పనిచేసింది. ప్రచండ పార్టీ చైర్మన్ అయ్యారు. కానీ త్వరలోనే ఆయనకు అంతా అర్థమైంది. పార్టీ స్థాయీ సంఘాన్ని సంప్రదించకుండా మంత్రులు, విదేశాలకు రాయబారులు తదితరుల్ని నియమిస్తూ ఓలి తనను నామమాత్రం చేశారని, ప్రభుత్వంతోపాటు పార్టీపై కూడా ఆయన పట్టే సాగుతోందని గుర్తించారు. మళ్లీ ప్రచండలో అసంతృప్తి మొదలైంది. దాన్ని చల్లార్చడానికి మరో మంచి పదవి అప్పగిస్తానని ఓలి ఊరించారు. కానీ పాలనా పగ్గాలు అప్పజెప్పడం మినహా తనకు మరేదీ సమ్మతం కాదని ఆయన హఠాయించారు. పేచీ సద్దుమణగకపోవడంతో కొంతకాలంగా ఓలి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని కొన్ని రోజులుగా ఆయన హెచ్చరిస్తున్నారు. తాజా నిర్ణయంతో అదేమిటో అందరికీ అర్థమైంది.
ఓలి, ప్రచండల మధ్య మౌలికంగా చాలా వ్యత్యాసాలున్నాయి. నేపాల్‌లో హిందూ రాజరిక వ్యవస్థ వున్న కాలంలో అమలైన పార్టీ రహిత పంచాయతీ విధానానికి వ్యతిరేకంగా అరవయ్యో దశకంలోనే ఉద్యమం సాగించి కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఓలి పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. కానీ ప్రచండ ఇందుకు భిన్నం. ఆయన అజ్ఞాతంలో పనిచేసే కమ్యూనిస్టు పార్టీలో 1981లో చేరి, సాయుధ పోరాట రాజకీయాల్లో తలమునకలయ్యారు. అందుకే కావొచ్చు... రాజకీయ ఎత్తుగడల్లో ఓలితో పోలిస్తే ప్రచండ వెనకబడివున్నట్టు కనబడతారు. పార్టీలో కీలక నాయకులనదగ్గవారు ప్రచండతోనే వున్నారు. అందుకే ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని చెప్పినప్పుడు ఆయన పార్టీని చీలుస్తాడని ...ఆయనతో పార్టీనుంచి వైదొలగేవారు వుండరుగనుక ఓలి విఫలమవుతారని ప్రచండ వర్గం సీనియర్ నేతలు భావించారు. పార్టీ చీలికపై వున్న చట్ట నిబంధనలను మొన్న ఏప్రిల్‌లో మారుస్తూ ఓలి ఆర్డినెన్సు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ అంచనాకు కారణం కావొచ్చు.
పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో దాన్ని విరమించుకున్నా, ఓలి అసలు ఆంతర్యం పార్లమెంటు రద్దని ఇప్పుడు వారికి తెలిసొచ్చింది. ఓలి తాజా నిర్ణయంపై సుప్రీంకోర్టు ఏమంటుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. 76వ అధికరణ ప్రకారం ఒక ప్రభుత్వం కుప్పకూలినప్పుడు అప్పుడుండే పార్లమెంటుద్వారా తదుపరి ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యమని తేలాకే దాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. పాలకపక్షానికి మూడింట రెండొంతుల మెజారిటీ వుండగా పార్లమెంటును ఎలా రద్దు చేస్తారన్నదే ప్రశ్న. పాలకపార్టీ నేతలు పరస్పరం కుమ్ములాడుకుంటూ మధ్యలో పార్లమెంటుపై దాడి చేయడం సరికాదని విపక్షాలు అంటున్నాయి. నేపాల్ రాజకీయాలు మొదటినుంచీ పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, భారత్‌లతో ముడిపడివుంటున్నాయి. ఓలి, ప్రచండలిద్దరూ చైనాకు సన్నిహితులే. అందుకే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు చైనా లోపాయికారీగా కష్టపడింది. కానీ ఆ మధ్యవర్తిత్వం తనకు అనుకూలంగా వుండదనుకున్నారో, ఏమోగానీ ఓలి ఇటీవల మన దేశానికి దగ్గరయ్యారు. గత నెలలో మన విదేశాంగ కార్యదర్శి ఆ దేశం పర్యటించారు. భూకంప వైపరీత్యంనుంచి అయిదేళ్లయినా కోలుకోని నేపాల్ కరోనా మహమ్మారితో మరింత సంక్షోభంలో పడింది. ఇలాంటి సమయంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి.