మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీతో నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ హౌస్కు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మకు మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారత్లో పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. 2011లో నేపాల్ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మొదటిసారిగా భారత్లో పర్యటించారు. ఆ తర్వాత 2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి ప్రధాని సుశీల్ కోయిరాల హాజరయ్యారు. అలాగే అదే ఏడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ నేపాల్లో పర్యటించారు. అదే ఏడాది నవంబర్లో ఖాట్మండ్ వేదికగా జరిగిన సార్క్ లో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ తేదీన కె.పి.శర్మ భారత పర్యటన ముగించుకుని ముంబై నుంచి తిరిగి నేపాల్ కి వెళ్లతారు.