krishna board chairman
-
మీ వైఫల్యం వల్లే.. సాగర్ స్పిల్ వే సగం స్వాధీనం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్‌కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది. ► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం. ► సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు. నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
నేడు కృష్ణా బోర్డు చైర్మన్ పదవీవిరమణ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తాను 2019 మార్చి 31న కేంద్ర జల్ శక్తి శాఖ బదిలీ చేసి.. సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్న పరమేశంను 2019 ఏప్రిల్ 1న పదోన్నతిపై కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటకు చెందిన పరమేశం కృష్ణా బోర్డు చైర్మన్‌గా 25 నెలల పాటు పనిచేశారు. పరమేశం పదవీ విరమణ నేపథ్యంలో కృష్ణా బోర్డు కొత్త చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ నియమించే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్ ఆర్గనైజేషన్) సీఈగా పనిచేస్తున్న ఎంపీ సింగ్ సర్దార్ సరోవర్ కన్స్ట్రక్షన్ అడ్వయిజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జూన్ 1న ఎంపీ సింగ్ ఒక్కరికే అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించనుంది. విభజన చట్టం ప్రకారం అనదపు కార్యదర్శి హోదా ఉన్న కేంద్ర జల్ శక్తి శాఖ అధికారినే కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించాలి. ఈ నేపథ్యంలో ఎంపీ సింగ్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నర్మదా నదిపై గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పనుల్లో కీలక భూమిక పోషించిన ఎంపీ సింగ్‌కే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని సీడబ్ల్యూసీ వర్గాలు వెల్లడించాయి. -
అడ్డుకోకుంటే దక్షిణ తెలంగాణ ఎడారే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచి న రాయలసీమ లిఫ్టు పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్ధ్యం పెంపు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని టీపీసీసీ ప్రతినిధుల బృందం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ చేపట్టబోయే ప్రాజెక్టులను నిలువరించకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్లగొండలు పూర్తిగా ఎడారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ప్రాజెక్టుల విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని వాటిని ఆపాలని, దీన్ని వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. గురువారం ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు నాగం జనార్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డిలతో కూడిన బృందం జలసౌధలోని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో భేటీ అయింది. ఏపీ ఇచ్చి న జీవో 203 అంశాన్ని వివరించడంతో పాటు, తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించింది. పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు దీన్ని అడ్డుకోవాలని సూచించింది. ప్రధానికి, కేంద్రమంత్రికి లేఖలు రాస్తాం: ఉత్తమ్ ఈ భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఇచ్చిన జీవోతో తెలంగాణకు తీవ్ర నష్టమని, వీటిని వెంటనే ఆపేలా తమ పరిధిలో చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో పాటు, క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కోరామన్నారు. ఏపీ జీవో మేరకు ముందుకు పోతే, దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారడంతో పాటు, సాగర్ జలాలపై ఆధారపడిన హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కష్టాలు తప్పవన్నారు. దీంతో పాటే నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేందుకు టెలిమెట్రీ వ్యవస్థను సమర్ధంగా వాడేలా చూడాలని, రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో పర్యవేక్షణ ఏర్పా టు చేయాలని కోరామన్నారు. దీనిపై తప్పనిసరిగా పరిశీలన చేసి తమ పరిధి మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై పార్టీ ఎంపీలంతా కలిసి ప్రధాని మోదీకి లేఖ రాస్తామని, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశామని, ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేశామని తెలిపారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే పోతిరెడ్డిపాడు కట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘అన్నోడికి సిగ్గు, శరం ఉండాలి. నేను ఆ రోజు మంత్రిగా లేనని గుర్తుంచుకోవాలి’అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెబుతున్నట్లుగా ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదని, కాళేశ్వరం పాత ప్రాణహిత–చేవెళ్ల అయితే, దుమ్ముగూడెంను సీతారామ సాగర్‌గా పేరుమార్చారన్నారు. -
పంచాయతీ తేల్చేదెవరు..?
- కృష్ణా జలాలపై పట్టింపు లేని కేంద్రం, బోర్డు - నేడు హైదరాబాద్‌కు కృష్ణా బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో తెలుగు రాష్ట్రాల నీటి వినియోగ విధివిధానాల ఖరారుపై అటు కేంద్ర జల వనరుల శాఖ, ఇటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. వాటర్ ఇయర్ ఆరంభమై నెల రోజులు ముగిసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వినియోగ విధానంపై సమన్వయం చేయకుండా చేతులెత్తేస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో పదేళ్ల కనిష్టానికి నీటి మట్టాలు చేరుకున్న దృష్ట్యా తెలంగాణ శ్రీశైలం నుంచి నీటి విడుదల కోరుతున్నా, పట్టిసీమ వాటా తేల్చాలంటున్నా కేంద్రం, బోర్డులు మౌనాన్నే పాటిస్తున్నాయి. నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే ఎగువ శ్రీశైలం నుంచి 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ గత నెలలో మూడు మార్లు కృష్ణా బోర్డుకు విన్నవించినా ఫలితం లేదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని పంపింగ్ చేసేందుకు సాగర్‌లో 502 అడుగుల నీటి మట్టాలు ఉండాలని, అయితే ప్రస్తుతం సాగర్‌లో మట్టం 501.6 అడుగులకు పడిపోయిందని తెలిపినా బోర్డు, ఈ విషయాన్ని ఏపీకి తెలియజేసి వారి అభిప్రాయం కోరడం తప్ప ఏం చేయలేకపోయింది. మూడు సార్లు ఫిర్యాదు చేయగా, దీనిపై ఏపీ తేల్చనప్పుడు తామేం చేయాలంటూ, కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తెచ్చింది. అయినా సమస్య మాత్రం అలాగే ఉండి పోయింది. సమన్వయ సమావేశాలెప్పుడు? ఇక ప్రతి ఏటా వాటర్ ఇయర్ జూన్ నుంచి మరుసటి ఏడాది జూన్వరకు నీటి వినియోగ ముసాయిదాను ఖరారు చేసుకోవాల్సి ఉం టుంది. ముసాయిదా ఖరారుకు సంబంధిం చి కేంద్ర జలవనరుల శాఖ ఏటా జూన్ లోనే ఇరు రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వివాదాలకు పరిష్కారం చూపుతూ వస్తోంది. గత ఏడాది జూన్ 21, 22 తేదీల్లోనే సమన్వయ సమావేశాలు పెట్టి ము సాయిదా ఖరారు చేసింది. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు దీనిపై కదలిక లేదు. గత ఏడాది ముసాయిదానే కొనసాగించాలని తెలంగాణ, చిన్నపాటి మార్పులు చేయాలని ఏపీ బోర్డుకు ఇప్పటికే తెలియజేసినా, తమ స్పందన ఏంటన్నది బోర్డు, కేంద్రం తెలు పడం లేదు. ఇక పట్టిసీమతో గత ఏడాది ఏపీ చేసిన వినియోగం 53 టీఎంసీల్లో వాటాలపై ఎటూ తేల్చని కేంద్రం, బోర్డులు ఈ ఏడాది తిరిగి ఏపీ పట్టిసీమతో వినియోగం మొదలుపెట్టినా పట్టించుకోవడం లేదు. ఈ అన్ని అంశాలపై ముందుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలా? లేక నేరుగా కేంద్రం వద్దే సమావేశం ఏర్పాటు చేయాలా అన్న దానిపైన ఇంతవరకు స్పష్టత రాలేదు. కాగా, గత కొన్ని వారాలుగా ఢిల్లీలో ఉన్న కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చాక బోర్డు లేక కేంద్రం వద్ద సమావేశాలపై స్పష్టత వస్తుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
‘కృష్ణా’లో కొత్త సమస్య!
ఈ నెలాఖరున ముగియనున్న బోర్డు చైర్మన్ పదవీకాలం ∙కొత్త చైర్మన్ నియామకంపై ఉలుకూపలుకూ లేని కేంద్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు ఓ కొలిక్కి రాకముందే మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్ శరాణ్ పదవీ కాలం ఈ నెలతో ముగియనున్నా.. ఆ స్థానం లో మరొకరిని భర్తీ చేయడంపై కేంద్రం ఎలాం టి కసరత్తు చేయకపోవడం కలవర పరు స్తోంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, పరస్పర ఫిర్యాదులు, విజ్ఞప్తులు నెలకొన్నాయి. ఈ సమయంలో చైర్మన్ పదవి ఖాళీ అవుతుండడంతో.. అది భర్తీ అయ్యే వరకూ జల వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నిర్లక్ష్యం వాస్తవానికి బోర్డులకు చైర్మన్ల నియామకంపై కేంద్రం తొలి నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరి స్తోంది. కృష్ణా బోర్డు ఏర్పాటైన తొలినాళ్లలో అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాకు చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టింది. అనంతరం మూడు నెలలకు కొత్తగా ఎస్కేజీ పండిత్‌కు బాధ్యతలు కట్టబెట్టినా... ఓ నాలుగు నెలల తర్వాత గోదావరి బోర్డుకు ఆయన్నే ఇన్చార్జి చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీకాలం ముగిశాక కేవలం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఎన్ఏవీ నాథన్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఆయన నెల రోజుల్లోనే పదవీ విరమణ చేసి వెళ్లిపోవడంతో.. గోదావరి బోర్డు చైర్మన్‌గా ఉన్న రామ్శరాణ్కు కృష్ణా బోర్డు బాధ్యతలు కూడా అప్పగించింది. తాజాగా రామ్‌శరాణ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అంటే ఇక రెండు బోర్డులకూ చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. కానీ కొత్త చైర్మన్ల నియామకంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, ఉమ్మడి ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, వాటాలపై రెండున్నరేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైర్మన్ లేకపోవడం కొత్త సమస్యగా కనిపిస్తోంది. కాగా కేంద్రం ఏదో ఒక బోర్డుకు చైర్మన్‌ను నియమించి వారికే రెండు బోర్డుల బాధ్యతలు అప్పగించే అవకాశముందని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. అఫిడవిట్‌పై మరింత గడువు కోరనున్న తెలంగాణ కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా... ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై మరిం త గడువు కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ట్రిబ్యు నల్కు లేఖ రాయనున్నట్లు తెలిసింది. ట్రిబ్యునల్ తన తీర్పు సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై తెలంగాణ, ఏపీలు 4 వారాల్లో తమ అభిప్రా యాలు చెప్పాలని కోరింది. దీనిపై ఇప్పటికే ఓమారు గడువు పొడిగింపు కోరగా ట్రిబ్యునల్ ఈ నెల 30 వరకు గడువిచ్చింది. తాజాగా మరోమారు గడువు పొడిగింపు కోరనున్నారు.