‘కృష్ణా’లో కొత్త సమస్య!
ఈ నెలాఖరున ముగియనున్న బోర్డు చైర్మన్ పదవీకాలం
∙కొత్త చైర్మన్ నియామకంపై ఉలుకూపలుకూ లేని కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు ఓ కొలిక్కి రాకముందే మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్ శరాణ్ పదవీ కాలం ఈ నెలతో ముగియనున్నా.. ఆ స్థానం లో మరొకరిని భర్తీ చేయడంపై కేంద్రం ఎలాం టి కసరత్తు చేయకపోవడం కలవర పరు స్తోంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, పరస్పర ఫిర్యాదులు, విజ్ఞప్తులు నెలకొన్నాయి. ఈ సమయంలో చైర్మన్ పదవి ఖాళీ అవుతుండడంతో.. అది భర్తీ అయ్యే వరకూ జల వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
కేంద్రం నిర్లక్ష్యం
వాస్తవానికి బోర్డులకు చైర్మన్ల నియామకంపై కేంద్రం తొలి నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరి స్తోంది. కృష్ణా బోర్డు ఏర్పాటైన తొలినాళ్లలో అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాకు చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టింది. అనంతరం మూడు నెలలకు కొత్తగా ఎస్‌కేజీ పండిత్‌కు బాధ్యతలు కట్టబెట్టినా... ఓ నాలుగు నెలల తర్వాత గోదావరి బోర్డుకు ఆయన్నే ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీకాలం ముగిశాక కేవలం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఎన్‌ఏవీ నాథన్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఆయన నెల రోజుల్లోనే పదవీ విరమణ చేసి వెళ్లిపోవడంతో.. గోదావరి బోర్డు చైర్మన్‌గా ఉన్న రామ్‌శరాణ్‌కు కృష్ణా బోర్డు బాధ్యతలు కూడా అప్పగించింది. తాజాగా రామ్‌శరాణ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అంటే ఇక రెండు బోర్డులకూ చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. కానీ కొత్త చైర్మన్ల నియామకంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, ఉమ్మడి ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, వాటాలపై రెండున్నరేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైర్మన్ లేకపోవడం కొత్త సమస్యగా కనిపిస్తోంది. కాగా కేంద్రం ఏదో ఒక బోర్డుకు చైర్మన్‌ను నియమించి వారికే రెండు బోర్డుల బాధ్యతలు అప్పగించే అవకాశముందని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది.
అఫిడవిట్‌పై మరింత గడువు కోరనున్న తెలంగాణ
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా... ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై మరిం త గడువు కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ట్రిబ్యు నల్‌కు లేఖ రాయనున్నట్లు తెలిసింది. ట్రిబ్యునల్ తన తీర్పు సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై తెలంగాణ, ఏపీలు 4 వారాల్లో తమ అభిప్రా యాలు చెప్పాలని కోరింది. దీనిపై ఇప్పటికే ఓమారు గడువు పొడిగింపు కోరగా ట్రిబ్యునల్ ఈ నెల 30 వరకు గడువిచ్చింది. తాజాగా మరోమారు గడువు పొడిగింపు కోరనున్నారు.