‘వాటర్‌గ్రిడ్’పై ఏపీ తకరారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు కొలిక్కి రాకముందే మరో కొత్త వివాదం మొదలైంది. వాటర్‌గ్రిడ్ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి జరిపిన నీటి కేటాయింపులపై తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, బోర్డుకు తెలపకుండా ఉత్తర్వులిచ్చిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఏ లెక్కన ఈ నీటిని కేటాయించిందో తెలపాలని కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు రాసిన లేఖల్లో కోరింది. నదీ జలాల్లో నీటి వాడకంపై కొత్తగా ఏ పథకాలు చేపట్టాలన్నా బోర్డు సమ్మతి ఉండాలన్న షరతును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్రం... జవాబు చెప్పాలంటూ తెలంగాణ సర్కారును వివరణ కోరింది.
వాటర్‌గ్రిడ్ టెండర్ల ఖరారు దశలో...
రాష్ట్ర ప్రజలందరికీ రానున్న మూడేళ్లలో సురక్షిత తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కృష్ణా, గోదావరి బేసిన్లలోని 26 సెగ్మెంట్లకు నీటిని అందించేందుకు ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించింది. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే హక్కు ఉందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అవసరాల మేరకు ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌కు నీటిని కేటాయించింది.
ఇందులో భాగంగానే కృష్ణా బేసిన్లో మొత్తంగా 19.59 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులోనూ కృష్ణా జలాల నుంచే మహబూబ్‌నగర్ జిల్లాకు 6.82 టీఎంసీలు, నల్లగొండ జిల్లాకు 4.96 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాకు 5 టీఎంసీల మేర కేటాయింపులు జరిపి వీటికి దగ్గర్లోని ప్రాజెక్టుల నుంచి నీరివ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి టెండర్లు ఖరారు చేసే దశలో నీటి వినియోగంపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తింది.
వివరణ ఇవ్వండి: కేంద్రం
ఈ అంశంపై కేంద్ర జలవనరుల శాఖ సూచన మేరకు కృష్ణా బోర్డు తెలంగాణ రాష్ట్ర వివరణ కోరింది. దీనిపై బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా గురువారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ట్రిబ్యునల్ జరిపిన 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటారా లేక అదనపు జలాలు వినియోగిస్తారా? అనే అంశంపై ఏపీ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది.