ఆ అవసరం లేదు!
సాక్షి, ముంబై: వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత షిండే మొదటిసారిగా షోలాపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నేతృత్వం మారిస్తే పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిననంత మాత్రాన శాసనసభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని భావించడం సరైన అభిప్రాయం కాదన్నారు. శాసనసభ ఎన్నికల్లో 1974 నుంచి శాసనసభ, రాజ్యసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, పోటీచేసిన ప్రతిసారీ తనను విజయం వరించిందన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నప్పటికీ షోలాపూర్ వాసులు తనకు భారీగా ఓట్లు వేశారు.
మోడీ ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడుతూ... ఆ రోజు జరిగిన ఉత్సవానికి సార్క్ దేశాల ప్రముఖులను ఆహ్వానించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలా ఆహ్వానించడంవల్ల వివిధ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని, అంతర్జాతీయ స్థాయిలో మన భారత్ పేరు మార్మోగుతుందన్నారు. అలా ఆహ్వానించడం ఆయన గొప్పతనమని కొనియాడారు. మోడీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఆలస్యంగా వెల్లడించడంతోనే తాను కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని, అయితే మోడీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపానన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తలెత్తిన పరిస్థితిపై మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వర్గీయుల నుంచి ముప్పు పొంచి ఉందని నాకు ముందే సమాచారం అందింది.
దీంతో అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహించాను. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో రెండు రోజులకు మించి ఎప్పుడూ బస చేయలేదు. కానీ మొదటిసారి 12 రోజులు షోలాపూర్ నియోజకవర్గంలోనే మకాం వేశాను. అయినప్పటికీ పార్టీ వర్గీయులు మోసం చేయడంవల్ల మొదటిసారి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింద’ని షిండే ఆవేదన వ్యక్తం చేశారు.