Krishna Milk Union
-
అనుభవం లేదు.. సమర్థతా లేదు
సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్‌గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్‌గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్‌గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్‌గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్‌గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు. ఎన్నో అవకతవకలు.. ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక.. ► 25 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. ► తాను చైర్మన్ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. ► ఉదా.. హెరిటేజ్ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. ‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు సమాధానం చెప్పకుండా చైర్మన్‌ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Vijaya Dairy: పా‘పాల’ పుట్ట!
విజయ డెయిరీ.. ఇది ఓ పా‘పాల’ పుట్ట.. అడుగడుగునా అక్రమాల చిట్టా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ఇప్పుడు అంతులేని విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత యూనియన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇప్పుడు అనేకానేక గోల్మాల్ వ్యవహారాలు గుప్పుమంటున్నాయి. భూముల కొనుగోలులో చేతివాటం మొదలు రూ.కోట్లలో నిధుల మాయం.. మితిమీరిన కమీషన్ల కక్కుర్తి.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సంస్థ భాగస్వాములే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రంలో అయితే ‘విజయ’ ముసుగులో ప్రైవేట్ దందాకు తెరతీశారు. మొత్తం మీద విజయ డెయిరీ పరిస్థితి ఇప్పుడు ‘మేడిపండు చూడ మేలిమై యుండు..’ అన్నట్లుగా ఉంది. సాక్షి, అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్‌కి చెందిన విజయ డెయిరీ అంటే ఒక బ్రాండ్. సుమారు 600 పాల ఉత్పత్తి సహకార సంఘాలు (సొసైటీలు) దీని కింద ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది రైతులున్నారు. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను సంస్థ సేకరిస్తుంది. ఇందులో కృష్ణాజిల్లా నుంచే ఎక్కువ పాలు సేకరిస్తారు. దీని వార్షిక టర్నోవర్ రూ.900 కోట్లుగా ఉంది. ఇంత ప్రతిష్ట ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్. కానీ, ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీస్తూ కొత్త పాలకవర్గం ఇష్టారాజ్యంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సంస్థను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యవహారశైలితో విజయ డెయిరీ బ్రాండ్ తన ప్రాభవాన్ని కోల్పోయిందని ఆందులో భాగస్వాములుగా ఉన్న పలు సొసైటీల చైర్మన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా అనేకచోట్ల విజయ పార్లర్లు పెట్టడం ద్వారా సంస్థ ప్రగతిపథంలో ఉందనే భ్రమ బయటకు కల్పిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలకవర్గం వచ్చిన రెండేళ్లలోనే సంస్థ పరిస్థితి దిగజారిందని, అనేక గోల్మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే మూడు, నాలుగేళ్లలో సంస్థ దివాళా తీయడం ఖాయమని వారు చెబుతున్నారు. అక్రమాల చిట్టా ఇదే.. ► కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొత్త డెయిరీ యూనిట్ పెడుతున్నామనే పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. ఇక్కడ తన స్నేహితుడికి చెందిన పొలం ఎకరం రూ.50 లక్షలుంటే రూ.75 లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అలాగే, వీరవల్లి పరిసరాల్లోనే రైల్వే ట్రాక్‌కు ఆనుకుని రూ.25 లక్షలున్న ఎకరం భూమిని రూ.50 లక్షలిచ్చి రెట్టింపు రేటుకు కొన్నారు. ఇలా సుమారు 13 ఎకరాలు కొని రూ.4 కోట్లకు పైగా జేబులో వేసుకున్నారు. ఈ భూములను ఎందుకు కొన్నారో ఇప్పటివరకు సొసైటీలకు చెప్పలేదు. మొదట్లో పెల్లెట్స్ (గుళికలు) తయారీ ఫ్యాక్టరీ కోసం భూములు కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓ కంపెనీకి రూ.90 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చి రూ.10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప లాభంలేదని తేలడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అడ్వాన్స్ మొత్తం ఏమైందో సమాధానం చెప్పే దిక్కులేదు. ► 2019లో కొత్త పాలకవర్గం వచ్చే నాటికి సంస్థలో రూ.90 కోట్ల రిజర్వు నిధులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఆ డబ్బును రెండేళ్లలోనే కరిగించేశారు. ఆ డబ్బును ఎందుకు, ఎక్కడ ఖర్చు పెట్టారో పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కొందరు అడిగినా ఇప్పటివరకు జవాబులేదు. బోనస్‌లో ఎలా బరితెగించారంటే.. గతంలో రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నప్పుడు రైతులకు రూ.65 కోట్ల బోనస్ ఇచ్చారు. ఇప్పుడు టర్నోవర్ సుమారు రూ.900 కోట్లకు చేరినా రైతులకిచ్చే బోనస్ రూ.45 కోట్లకు పడిపోయింది. గతంలో రైతులకు లీటర్‌కు రూ.32 పైసల చొప్పున 3 విడతలుగా బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15 పైసలకి తగ్గించి ఒకసారే ఇస్తున్నారు. చైర్మన్ దుబారా, ధనదాహమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. విజయ పార్లర్లలో ఇతర బ్రాండ్లు ఇక విజయ పార్లర్లలో ఇతర సంస్థల ఉత్పత్తులను విజయ బ్రాండ్ పేరిట విక్రయించడానికి గేట్లు బార్లా తెరిచారు. దీంతో బ్రాండ్ పేరు మసకబారింది. కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐస్‌క్రీం, బ్రెడ్, కేక్, బిస్కెట్లు కొని వాటిని విజయ ఉత్పత్తులుగా అమ్ముతుండడంపై సంస్థలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎలాంటి టెండర్ లేకుండా ఒక ఐస్‌క్రీం కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేశారు. అలాగే, విజయ పాలకు ఉన్నట్లే విజయ పశు దాణాకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని కూడా స్వయంగా తయారుచేయకుండా కమీషన్ల కోసం ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. దీంతో అమ్మకాలు పడిపోయి నష్టాలు వస్తున్నాయి. ► ఇక చిత్తూరు జిల్లా రైతుల నుంచి సేకరించిన లీటర్ పాలకు రూ.3 బోనస్ ఇస్తామని చెప్పి రూ.1 మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.2 మింగేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాగే వెండర్స్‌కి 7.5 శాతం బోనస్ ఇస్తామని చెప్పి డబ్బు డ్రా చేసి 3.5 శాతమే ఇచ్చారు. ఇప్పటికీ ఈ రైతులు, వెండర్లు తమ బోనస్ కోసం డెయిరీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ► అవసరం లేకపోయినా కమీషన్ల వేటలో భారీగా వెన్న, పాల పొడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్లో వీటి స్టాకు పెద్దఎత్తున నిల్వ ఉంది. ► తెలంగాణలోని కోదాడ, ఖమ్మంలో విజయ డెయిరీకి గతంలో 16 వేల లీటర్ల మార్కెట్ ఉండేది. అది ప్రస్తుతం వెయ్యి లీటర్లకు పడిపోవడం వెనుక చైర్మన్ మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా కొందరితో కలిసి అక్కడే పాలు కొని సొంతంగా ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు సమాచారం. విజయ బ్రాండ్ పేరుతో సొంత లాభం కోసం ఇలా ప్రైవేటు దందాకు తెరతీశారని చెబుతున్నారు. ► తన పబ్లిసిటీ పిచ్చికి తమ చైర్మన్ రూ.50 లక్షలు వృధా చేసినట్లు వివిధ సొసైటీల చైర్మన్లు వాపోతున్నారు. యూనియన్ చైర్మనే స్వయంగా ఫ్లెక్సీలు వేయించి వాటిని అన్ని సొసైటీలకు లారీలో పంపి కట్టించారు. -
రూ.20 కోట్లతో ‘విజయ’ కొత్త యూనిట్
విజయవాడ (చిట్టినగర్) : రూ.20 కోట్ల వ్యయంతో ఏప్రిల్ నాటికి లక్ష లీటర్ల పాలను నిల్వ, ప్యాకింగ్ చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు బోర్డు కృషి చేస్తోందని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ మండవ జానకీరామయ్య పేర్కొన్నారు. బుధవారం పాల ప్రాజెక్టు పరిపాలన భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. మండవ జానకీరామయ్యను బోర్డు డైరెక్టర్లు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత బోర్డు సమావేశానికి హాజరైన డైరెక్టర్లు పాలప్రాజెక్టు ఆవరణలోని కాకాని వెంకట రత్నం, కురియన్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండవ జానకీరామయ్యను చైర్మన్‌గా దాసరి బాలవర్ధనరావు ప్రతిపాదించగా, చలసాని ఆంజనేయులు బలపరిచారు. దీంతో చైర్మన్‌గా మండవ జానకీ రామయ్యను ప్రకటిస్తూ ఎన్నికల అధికారి జనార్ధన్ ప్రకటించారు. నూతన బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన మండవకు పలువురు డైరెక్టర్లు పుష్పగుచ్ఛాలను అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండవ జానకీరామయ్య మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో విజయ డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎండీ త్రిపురనేని బాబూరావుతో పాటు పలువురు బోర్డు డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
విజయమెవరిదో!
కృష్ణా మిల్క్ యూనియన్‌లో మళ్లీ ఆధిపత్య పోరు చైర్మన్ పదవి కోసం రెండు వర్గాల పోటీ 3 డెరైక్టర్ పదవులకు 10 మంది నామినేషన్లు 25న ఓటింగ్ విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఆధిపత్య పోరు మరోసారి తీవ్రరూపం దాల్చింది. చైర్మన్ మండవ జానకిరామయ్యను పదవి నుంచి తప్పించి ఆ సీట్లో కూర్చునేందుకు ప్రత్యర్థి వర్గీయులు పావులు కదుపుతున్నారు. జానకిరామయ్య కూడా తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్‌లో ఈ నెలాఖరుకు మూడు డెరైక్టర్(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) పదవులు ఖాళీ అవుతాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 25న ఓటింగ్ నిర్వహించనున్నారు. మూడు స్థానాలను దక్కించుకుని చైర్మన్ పదవిని పొందాలని ప్రత్యర్థి వర్గీయులు, తన పదవిని కాపాడుకునేందుకు జానకిరామయ్య ఎవరికి వారే ఎత్తులు వేస్తున్నారు. దీంతో విజయం ఎవరికి దక్కుతుందోనని టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధిష్టానం వద్ద గత ఏడాది ఒప్పందం.. జానకిరామయ్యను తప్పించి ఆయన స్థానంలో గన్నవరం మాజీ దాసరి బాలవర్ధనరావును నియమించేందుకు టీడీపీలోని ఓ వర్గం గతేడాది ప్రయత్నించింది. జానకిరామయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పంచాయితీ టీడీపీ అధిష్టానం వద్దకు చేరింది. అప్పట్లో చైర్మన్‌గా మండవ కొనసాగేలా, బాలవర్ధనరావు కేవలం డెరైక్టర్ పదవితోనే సరిపెట్టుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే, ఏడాది తర్వాత బాలవర్ధనరావును చైర్మన్‌ను చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం మండవ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, ఆయన ఇందుకు సముఖంగా లేనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జానకిరామయ్య వర్గానికే చెందిన మూడు డెరైక్టర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఎలాగైనా వాటిని దక్కించుకుని చైర్మన్ పదవి పొందాలని దాసరి వర్గం ప్రయత్నిస్తోంది. దీంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాసరి వర్గం నుంచి ఏడుగురు..మండవ వర్గం నుంచి ముగ్గురు.. విజయవాడ పాలప్రాజెక్టు ఆవరణలోని క్షీరదర్శిని సమావేశ మందిరంలో శుక్రవారం నామినేషన్ పత్రాలను స్వీకరించారు. జానకిరామయ్య వర్గానికి చెందిన బీవీకే సుబ్బారావు, జాస్తి రాధాకృష్ణ, యెర్నేని గీతాదేవి నామినేషన్లు దాఖలు చేశారు. దాసరి వర్గానికి చెందిన వేమూరి సాయి వెంకటరమణ, యార్లగడ్డ శ్యామ్‌బాబు, లింగం ఉషారాణి, శ్రీపద్మ, శ్రీనివాసరావు, పెద్ద రంగమ్మ, ఎ.బాబు నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆరపరేటివ్ సొసైటీస్ రిటైర్డ్ అధికారి ఎల్.గురునాథం నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ నెల 25వ తేదీ ఉదయం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలో 435 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 15 డెరైక్టర్లకు గానూ, ప్రస్తుతం మూడు పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జానకిరామయ్య వర్గం నుంచి ఒక్కరు గెలిచినా ఆయన చైర్మన్ పదవిలోనే కొనసాగే అవకాశం ఉంది. టీడీపీ నేతలు కూడా మండవకు అనుకూలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండవ వ్యతిరేక వర్గం నుంచి ముగ్గురు గెలిస్తే దాసరి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.