రూ.20 కోట్లతో ‘విజయ’ కొత్త యూనిట్
రూ.20 కోట్లతో ‘విజయ’ కొత్త యూనిట్
Published Wed, Sep 21 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
విజయవాడ (చిట్టినగర్) :
రూ.20 కోట్ల వ్యయంతో ఏప్రిల్ నాటికి లక్ష లీటర్ల పాలను నిల్వ, ప్యాకింగ్ చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు బోర్డు కృషి చేస్తోందని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ మండవ జానకీరామయ్య పేర్కొన్నారు. బుధవారం పాల ప్రాజెక్టు పరిపాలన భవనంలోని బోర్డు సమావేశ మందిరంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. మండవ జానకీరామయ్యను బోర్డు డైరెక్టర్లు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత బోర్డు సమావేశానికి హాజరైన డైరెక్టర్లు పాలప్రాజెక్టు ఆవరణలోని కాకాని వెంకట రత్నం, కురియన్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండవ జానకీరామయ్యను చైర్మన్‌గా దాసరి బాలవర్ధనరావు ప్రతిపాదించగా, చలసాని ఆంజనేయులు బలపరిచారు. దీంతో చైర్మన్‌గా మండవ జానకీ రామయ్యను ప్రకటిస్తూ ఎన్నికల అధికారి జనార్ధన్ ప్రకటించారు. నూతన బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన మండవకు పలువురు డైరెక్టర్లు పుష్పగుచ్ఛాలను అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండవ జానకీరామయ్య మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో విజయ డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎండీ త్రిపురనేని బాబూరావుతో పాటు పలువురు బోర్డు డైరెక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement