విజయ డెయిరీ చైర్మన్ గిరిపై దాసరి గురి!
సాక్షి, విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే దాసరిబాలవర్ధనరావు ఎట్టకేలకు విజయ డెయిరీ డెరైక్టరుగా ఎన్నికయ్యారు. రాబోయే రోజుల్లో విజయడైయిరీ చైర్మన్ పదవిపై ఆయన పోటీపడే అవకాశం ఉంది. విజయ డెయిరీలోకి అడుగు పెట్టేందుకు దాసరి ఏడాది క్రితమే ప్రయత్నించారు. అయితే అప్పట్లో విజయ డెయిరీ చైర్మన్ మండవ జానకీ రామయ్య దాసరి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం చివరకు చంద్రబాబు వరకు వెళ్లడంతో అప్పట్లో దాసరి బాలవర్ధనరావు వెనక్కు తగ్గారు. ఈసారి ఆయన డెయిరీలోకి అడుగుపెట్టడంతో రాబోయే రోజుల్లో దాసరి వర్గానికి, చైర్మన్ మండవ వర్గానికీ మధ్య కోల్డ్‌వార్ జరిగే అవకాశం ఉన్నట్లు డెయిరీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పట్టువీడని దాసరి...
ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో మూడు డెరైక్టర్ల పోస్టులు ఖాళీ అవుతాయి. ఈ ఏడాది తిరిగి దాసరి బాలవర్ధనరావు డెరైక్టర్ పోస్టు కోసం పోటీపడ్డారు. ఈ ఏడాది కూడా దాసరి బోర్డులోకి రాకుండా మండవ జానకీరామయ్య విశ్వప్రయత్నం చేశారు. తనకు అనుకూలంగా ఉన్నవారినే ముగ్గురు డెరైక్టర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నించారు. అయితే జిల్లా తెలుగుదేశం నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనగళ్లనారాయణ, గొట్టిపాటి రామకష్ణప్రసాద్ తదితరులు దీన్ని అంగీకరించలేదు. వారం రోజులుగా వారు మండవ జానకిరామయ్యతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. తాము సూచించిన ఇద్దరికి డెరైక్టర్ పోస్టులివ్వాలని పట్టుబట్టారు. అయితే దాసరి బాలవర్ధనరావు మినహా మిగిలిన వారిని డెరైక్టర్లుగా తీసుకుంటానంటూ మండవ షరతు పెట్టినట్లు సమాచారం. దీనికి టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో పార్టీ సూచించిన దాసరిబాలవర్ధనరావు, వాణీశ్రీలకు డెరైక్టర్లుగా అవకాశం ఇచ్చి, తన తరఫున వేమూరి రత్నగిరిరావుతో మండవ సరిపెట్టుకున్నారు.
మండవకు దాసరి చెక్ పెట్టేనా!?
విజయ డెయిరీలో 15 మంది డెరైక్టర్లుంటారు. వారిలో ఒకర్ని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు మండవ జానకీరామయ్య తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పటికే ఆయన వైపు ఎనిమిది మంది డెరైక్టర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేగా పనిచేసిన దాసరి బాలవర్ధనరావు బోర్డులోకి రావడంతో ఆయన చైర్మన్ పదవికి పోటీ పడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బోర్డులో మండవకు వ్యతిరేకంగా ఉన్న వర్గమంతటిని దాసరి ఏకతాటిపైకి తీసుకొచ్చి చైర్మన్ గిరిని దక్కించుకునే అవకాశం ఉంది.
మండవ తప్పుకుంటారా?
మండవ జానకీరామయ్యకు 2016 వరకు డెరైక్టర్‌గా కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగవచ్చు. అయితే గతంలో జిల్లా టీడీపీ నేతలతో జరిగిన ఒప్పందం ప్రకారం విజయ డెయిరీ ప్రాంగణంలో ఎన్టీఆర్, క్షీర పితామహుడు కురియన్ విగ్రహాలను ప్రతిష్టించిన తరువాత బాధ్యతలు నుంచి తప్పుకుంటానని మండవ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది చివరకు విగ్రహాలు ప్రతిష్ట పూర్తి అవుతుందని ఆ తరువాత ఆయన తప్పుకుంటే దాసరి చైర్మన్ అవుతారని కొంతమంది డెరైక్టర్లు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్ట తరువాత మండవ తప్పుకుంటారంటూ హామీ ఇచ్చారనే వాదనను ఆయన అనుకూల డెరైక్టర్లు కొట్టిపారేస్తున్నారు. ఆయన చివరి వరకూ కొనసాగుతారని వాదిస్తున్నారు. కాగా ఐదారు నెలలు చూసి తప్పుకోకపోతే అవిశ్వాసతీర్మానం పెట్టి తప్పించి దాసరిని చైర్మన్ చేయాలని మరికొంతమంది డెరైక్టర్లు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా రాబోయే రోజుల్లో విజయడెయిరీలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాలు మధ్య కుమ్ములాట జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
ముగ్గురు డెరైక్టర్లు ఏకగ్రీవం....
ఎట్టకేలకు విజయ డెయిరీకి ముగ్గురు డెరైక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ డెయిరీలో మూడు డెరైక్టర్ పదవులకు 11 మంది పోటీ పడ్డారు. దాసరి బాలవర్ధనరావు(ఆముదాలపల్లి), వేమూరి రత్నగిరిరావు(దేవరకోట), నక్కలపు వాణీశ్రీ(కమ్మటూరు-విసన్నపేట)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి ఎల్.గురునాధం అధికారికంగా ప్రకటించారు. ఒకొక్క డెరైక్టర్ ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు