చావులో కూడా కలిసే సాగారు
తిరుపతి: కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని వారు మరిచిపోలేదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసే ఎదుర్కొన్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని వారు చావులో కూడా కలిసే గంటల వ్యవధిలో కన్నుమూశారు. భార్య అకస్మాత్తుగా మృతిచెందడంతో కుంగిపోయిన భర్త నీవెంటే నేనంటూ తనువు చాలించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది.
మండలంలోని కాశిరాళ్ల గ్రామంలో ఎం క్రిష్ణపిళ్లై(87) రైల్వేలో గార్డుగా పనిచేస్తూ 25 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. చెన్నై, వేలూరు, బెంగళూరు తదితర ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఫలితం లేదు. ఆయనను భార్య కె. సరోజమ్మ(80) కంటికి రెప్పలాగా చూసుకుంటోంది. భర్త ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న భర్త క్రిష్ణపిళ్లై తీవ్ర ఆవేదనకు గురై గంట వ్యవధిలో తనువు చాలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు.