శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి
వర్ధంతి సభలో వక్తల నివాళి
రాజమహేంద్రవరం కల్చరల్ :
కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి జాతీయ కవి అని, స్వాతంత్య్ర ఉద్యమానికి ఆయన మద్దతు ఉండేదని ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ ఆవరణలోని శ్రీపాద విగ్రహం వద్ద ఆయన మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో గురువారం కృష్ణమూర్తి శాస్త్రి 56వ వర్ధంతి జరిగింది. సమకాలీన రచయితలను శ్రీపాద ఎంతగానో ప్రోత్సహించేవారని నరసింహారావు తెలిపారు. నాటి పురపాలక సంఘం ఆయనకు అరుదైన స్వేచ్ఛా పౌరసత్వాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన భారతీ జాతీయ కవిసమ్మేళనంలో తెలుగువారి తరఫున శ్రీపాద హాజరయ్యారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త చాగంటి శరత్‌బాబు మాట్లాడుతూ శ్రీపాద ఒంటిచేత్తో భారత, భాగవత, రామాయణాలను అనువదించారని కొనియాడారు. శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రచనలను వెలుగులోకి తేవాలని కోరారు. రత్నం పె¯Œ్స అధినేత కేవీ రమణమూర్తి, విశ్రాంత బ్యాంకు అధికారి చావలి రామ్మూర్తిశాస్త్రి తదితరులు ప్రసంగించారు. సాహితీవేత్తలు డీవీ హనుమంతరావు, పెమ్మరాజు గోపాలకృష్ణ, కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీపాద స్వీయచరిత్ర పునర్ముద్రణకు కృషి
‘సాక్షి’తో కృష్ణమూర్తి శాస్త్రి మునిమనుమడు కల్లూరి శ్రీరామ్
‘కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి స్వీయచరిత్ర ’శ్రీకృష్ణస్వీయచరిత్రము’ నేడు అలభ్యంగా ఉంది, నా వద్ద సైతం జిరాక్సు ప్రతి మాత్రమే ఉంది’ అని శ్రీపాద మునిమనుమడు కల్లూరి శ్రీరామ్ పేర్కొన్నారు. శ్రీపాద వర్ధంతి సందర్భంగా నగరానికి వచ్చిన ఆయనను గురువారం ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘శ్రీపాద స్వీయచరిత్రలో నాటి సమకాలీన కవులు, సమాజం–ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి చూడవచ్చు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్రి్తతో ఆయనకు న్యాయస్థానంలో వివాదాలుండేవి. ఇద్దరూ కలసి భోజనం చేసి, ఒకే జట్కాలో న్యాయస్థానానికి వెళ్లేవారని చెబుతారు. ఈ వివరాలు సాహిత్యపరంగా వెలుగులోకి రావలసిన అవసరం ఉంది. కొంతమంది ప్రచురణకర్తలు పునర్ముద్రణకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. వారితో సంప్రదించి, త్వరలో ఒక నిర్ణయానికి వస్తాను. సుమారు వంద శ్రీపాద రచనలు కూడా అలభ్యంగానే ఉన్నాయి. శ్రీపాద సంపాదకత్వంలో వెలువడిన వజ్రాయుధం అనే పత్రికలో శ్రీపాద నాటి కవుల గుణదోషాలను నిర్మొహమాటంగా ఎత్తిచూపేవారు. దీనికి సంబంధించిన ప్రతి ఒకటి నా వద్ద ఉంది. పరిశోధకులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గ్రంథాలయాల్లో వీటి ప్రతులు ఉన్నాయోమో పరిశీలిస్తున్నాను. శ్రీపాద సమగ్ర సాహిత్యం తెలుగువారికి అందించే యజ్ఞంలో నేనూ ఒక సమిధనైతే.. అంతకన్నా అదృష్టం మరొకటి ఏముంటుంది?’