మహానేత స్వప్నం.. కృష్ణపట్నం
నేడు జాతికి అంకితం
కృష్ణపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు ‘కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం’ వెలుగులు విరజిమ్మబోతోంది. అవిభక్త రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాలన్న సంకల్పంతో కేంద్రంతో పోరాడి అనుమతులు తెచ్చిన ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ చేతుల మీదుగానే పునాది పడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 1,600 మెగావాట్లతో (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు) సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.
వైఎస్ కాలంలోనే రెండు యూనిట్ల పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. గతేడాది వాణిజ్య ఉత్పత్తిలోకి అడుగు పెట్టిన ఈ ప్రాజెక్టులను శనివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ తదితరులు హాజరవుతున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి అదనంగా రోజుకు 39 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.