ప్రైవేటు వ్యక్తినీ అవినీతి నిరోధక చట్టం కింద విచారించొచ్చు
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిందితులైన ప్రభుత్వోద్యోగులు లేనప్పుడు కూడా ప్రైవేటు వ్యక్తిని ప్రత్యేక కోర్టు విచారించొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నేరంలో భాగస్వామి అయిన ప్రైవేటు వ్యక్తిని కేవలం ప్రత్యేక కోర్టు జడ్జి విచారించాలని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1) తెలియజేస్తోందని వివరించింది. ఈ చట్టం కింద ప్రతి నేరంలోనూ నిందితుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాల్సిన అవసరం లేదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ప్రత్యేక కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ప్రభుత్వోద్యోగి జీవించి ఉండటం తప్పనిసరేమీ కాదని...ఆ వ్యక్తి లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా అవినీతి నిరోధక, అవినీతి నిరోధకేతర నేరాల కింద విచారించొచ్చని కోర్టు తెలిపింది. ప్రభుత్వోద్యోగి మృతిచెందినందు వల్ల అతనిపై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన నేరాలను విచారించడం కుదరదంటూ ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది.