కేఎస్ వ్యాస్ విలువలు సజీవం
వ్యాస్ స్మారక లెక్చర్‌లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్
హైదరాబాద్: కేఎస్ వ్యాస్ చనిపోయి ఏళ్లు గడిచినా ఆయన విలువలు పోలీస్ శాఖలో సజీవంగా ఉన్నాయని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేఆర్ నందన్ అభిప్రాయపడ్డారు. నిబద్ధతకు మారుపేరుగా పని చేసిన వ్యాస్ పోలీస్ సిబ్బంది, అధికారుల్లో ఇంకా బతికే ఉన్నారని కొనియాడారు. ప్రతీ ఏటా జనవరి 27న వ్యాస్ స్మారక లెక్చర్ పేరుతో ఇన్‌సర్వీస్ అధికారులకు పోలీస్ అకాడమీలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో నాయకత్వం–కేంద్ర లక్షణాలు అంశంపై కేఆర్ నందన్ ప్రసంగించారు. ప్రతీ అధికారి, సిబ్బంది ఆత్మవిశ్వాసంతో.. బాధిత ప్రజల్లో సంతృప్తి, స్ఫూర్తి నింపేలా పనిచేయాలని శిక్షణలో పాల్గొన్న అధికారులకు సూచించారు. అనంతరం డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. వ్యాస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయవాడ ఎస్పీగా ఉన్న సమయంలో వ్యాస్‌తో కలసి పనిచేసిన క్షణాలు మరిచిపోలేనని, ఈరోజు డీజీపీగా సక్సెస్ కావడానికి కారణం వ్యాస్ ఇచ్చిన స్ఫూర్తేనని తెలిపారు.
ప్రతీ సమస్యపై ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుందని వ్యాస్ చెప్పేవారని పేర్కొన్నారు. వ్యాస్ ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలమైన పోలీస్ బలగంగా ప్రాచుర్యం పొందిందంటే అది ఆయన కృషి, పట్టుదల వల్లే అని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీలు ప్రభాకర్, పద్మశ్రీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కేసీరెడ్డి, ఎంవీ కృష్ణారావు, కె. అరవిందరావు, రిటైర్డ్ డీఐజీ తోటా వెంకటరావు, హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఐజీలు ఎంకే సింగ్, మురళీకృష్ణ, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, జోనల్ ఐజీ నాగిరెడ్డి, డీసీపీ రమేశ్ నాయుడు, తప్సీర్ ఇక్బాల్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.