శివ...శివా... చూడవయ్యా ఈ సిత్రాలు
మూడునాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు
పది రోజులు గడవక ముందే గోతులు పడ్డ ఫ్లోరింగ్
పంచారామ క్షేత్రంలో నాసిరకంగా అభివృద్ధి పనులు
నేడు ఉప ముఖ్యమంత్రి రాజప్ప సమీక్ష సమావేశం
సామర్లకోట : పంచారామ క్షేత్రంలో అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పది రోజులు గడవక ముందే పెచ్చులూడిపోతుండడం పట్ల అటు భక్తులు, ఇటు ఆలయ పాలకవర్గం, అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో బుధవారం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.కోటితో అభివృద్ధి పనులు
పురాతన క్షేత్రం కావడంతో పురావస్తు శాఖ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆలయం అభివృద్ధికి రూ.కోటి నిధులు విడుదల కావడంతో ఆ శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో గార్డెన్ పెంపకం పనులు పూర్తి చేశారు. కోనేరు వరకూ సీసీ రోడ్డు, కోనేరు చుట్టూ మెట్లు ఏర్పాటు చేశారు. కోనేరు దిగువ భాగంలో జిగురు మట్టి ఉండటం వల్ల లోనికి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి ఇసుక వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనేరు అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ఓ దాత కూడా ముందుకు వచ్చారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం పైనుంచి ఆకతాయిలు కోనేరులోనికి దూకుతున్నారు. ఇప్పటి వరకు జిగురు మట్టిలో కూరుకుపొయి ఇద్దరు యువకులు మృతి చెÆందారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కోనేట్లో పుణ్య స్నానాలు చేస్తారు. మహాశివరాత్రి నాటికి ఇసుకు వేసి భక్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కొరుతున్నారు.
నాసిరకంగా ప్లోరింగ్ పనులు
ఆలయ ఆవరణలో ప్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. ఆలయ దిగువ భాగంలోని ఉప ఆలయాల చుట్టూ ఫ్లోరింగ్ పనులను గానుగు సున్నంతో చేశారు. పనులు పూర్తి చేసిన 10 రోజులు గడవక ముందే ఫ్లోరింగ్ పెచ్చులూడిపోయి గోతులు ఏర్పడటంతో ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు ముక్కున వేలు వేసుకున్నారు. గోతులు పడ్డ ప్రదేశంలో తిరిగి మరమ్మతులు చేయడం వల్ల అందంపోయి అతుకులు వేసిన్నట్టు ఉంటుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆలయ ప్రవేశంలో మెట్లు, గణపతి ఆలయం, శ్రీకుమారస్వామి ఆలయం వద్ద ఫ్లోరింగ్‌పై గోతులు పడ్డాయి. మొదటి అంతస్తులో ప్రాకారం చుట్టూ చేసిన ఫ్లోరింగ్ కూడా పాడై పోయింది. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నాసిరకంగా జరిగాయని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద కూడా పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయనని చెబుతున్నారు. ఫ్లోరింగ్ పనులకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పురావస్తు శాఖ సీఐ దృష్టికి తీసుకు వెళ్లారు.
కోనేరులో ఇసుక వేయాలి
పంచారామ క్షేత్రం కోనేరులో భక్తులు స్నానాలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది స్నానాలు చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో జిగురు మట్టిని తొలగించి ఇసుక వేయాలి. కొత్త నీటితో కోనేరును నింపాలి. - నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు, సామర్లకోట
అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం
ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగిన మాట వాస్తవమే. దీనిపై ట్రస్టు బోర్డుతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యను పరిష్కారిస్తాం.
- కంటే జగదీష్‌మోహనరావు, ట్రస్టు బోర్డు చైర్మన్, సామర్లకోట