మలేషియా విమానం కథ మళ్లీ మొదటికి
మలేషియా విమాన విషాదం కథ మళ్లీ మొదటికొచ్చింది. హిందూమహాసముద్రంలో నెలకు పైబడి జరిపిన అన్వేషణ నీటి మూటలా మారిపోయింది. శనివారం సముద్రంలో కనిపించిన చమురు తెట్టుకి సముద్రంలో కుప్పకూలిన విమానానికి ఎలాంటి సంబంధమూ లేదని పరీక్షలు రుజువు చేశాయి.
చమురు తెట్టునుంచి సేకరించిన రెండు లీటర్ల చమురు తెట్టు సాంపిల్స్ ని అధ్యయనం చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు రోబోట్ సాయంతో నడిచే సబ్మెరీన్ బ్లాక్ బాక్స్ ను కనుగొనగలిగితేనే ఎంతో కొంత పురోగతి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సబ్మెరీన్ తొలి రెండు సార్లు తన ప్రయత్నంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. దీంతో ఇప్పటి వరకూ కేవలం 90 చ.కి.మీ ప్రదేశాన్ని మాత్రమే సబ్మెరీన్ పరీక్షించి చూడగలిగింది.
మార్చి 8 న 239 మందితో బయలుదేరిన ఎం హెచ్ 370 విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం సముద్రంలో కుప్ప కూలి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పదకొండు విమానాలు, 11 పడవలు ప్రస్తుతం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.