'కుమారి 21 ఎఫ్' మూవీ రివ్యూ
టైటిల్ : కుమారి 21 ఎఫ్
జానర్ : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
తారాగణం : రాజ్ తరుణ్, హేబాపటేల్, నోయల్, హేమ
దర్శకత్వం : సూర్య ప్రతాప్ పల్నాటి
కథ, స్క్రీన్ ప్లే : సుకుమార్
నిర్మాత : సుకుమార్ రైటింగ్స్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా కుమారి 21 ఎఫ్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ లాంటి వరుస సూపర్ హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫితో చిన్న సినిమానే అయినా, భారీ తనాన్ని సొంతం చేసుకుంది. ప్రచార ఆర్భాటాలు లేకపోయినా ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన కుమారి 21 ఎఫ్ సినీ అభిమానులను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం..
కథ :
సిద్దూ (రాజ్ తరుణ్ ) ఓ సాదాసీదా కుర్రాడు. హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తల్లి పాటు కలిసి ఉంటున్న సిద్దూ తండ్రి తనను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడని ద్వేషం పెంచుకుంటాడు. తన కాలనీలో ఉండే ముగ్గురు కుర్రాళ్లతో స్నేహం చేస్తూ వాళ్లు చేసే పనులకు సాయం చేస్తుంటాడు. అదే సమయంలో వాళ్ల కాలనీకి వచ్చిన మోడల్ కుమారి(హేబాపటేల్)తో సిద్దూకు పరిచయం ఏర్పడుతుంది. ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే కుమారి, సిద్దూతో తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పేస్తోంది. అప్పటికే ఆ అమ్మాయిని రెండు సార్లు చూసిన సిద్దూ తన మీద ఉన్న అభిప్రాయం వల్ల ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోడు. నెమ్మదిగా వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఈ సమయంలో కూడా కుమారి ప్రవర్తన, తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల మూలంగా తనను ప్రేమించాలా..? వద్దా..? అన్న సందిగ్ధంలో పడతాడు.
అదే సమయంలో స్నేహితుల మాటలు విని కుమారికి దూరమవ్వాలనే ప్రయత్నంలో, మరో అమ్మాయితో స్నేహం చేస్తాడు. కానీ చాలా రోజులుగా తమకు దూరంగా ఉంటున్న తండ్రి గురించి ఓ నిజం తెలుసుకొని కుమారికి తన ప్రేమను చెప్పేయాలనుకుంటాడు. అనుకున్నట్టుగా సిద్దూ తన ప్రేమను కుమారికి చెప్పాడా..? తన ఫ్రెండ్స్ వల్ల సిద్దూ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కాలనీకి రాకముందు కుమారి గతం ఏంటి..? చివరకు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి సిద్దూ, కుమారి ఒక్కటయ్యారా..? అన్నదే సినిమా కథ.
నటీనటులు :
ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో కాస్త బరువైన పాత్రనే ఎంచుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే మోస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చిన సెంటిమెంట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వం, నిజాయితీ, మంచితనాన్ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్గా నటించిన హేబా పటేల్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. క్యూట్ లుక్స్‌తో పాటు బోల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది హేబా. నటన పరంగా పెద్దగా మెప్పించకపోయినా, గ్లామర్ షోతో మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. తొలిసారిగా నెగెటివ్ రోల్లో కనిపించిన నోయల్ మంచి నటన కనబరిచాడు.
సాంకేతిక నిపుణులు :
ఈ సినిమాకు దర్శకుడిగా సూర్య ప్రతాప్ పేరు పడినా సినిమా అంతా సుకుమార్ స్టైల్ లోనే సాగుతుంది. సుకుమార్ మార్క్ టిపికల్ క్యారెక్టర్స్, ఐటమ్ సాంగ్స్, స్క్రీన్ ప్లే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మొదటి నుంచి సినిమా మీద అంచనాలను పెంచిన దేవిశ్రీ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. అయితే పాటల కన్నా నేపథ్య సంగీతం మరింతగా ఆకట్టుకుంది. సుకుమార్ కథా స్క్రీన్‌ప్లే తన స్టైల్లో రెగ్యులర్ గా సాగిపోయినా, కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ :
పేరుకు సుకుమార్ నిర్మాతే అయినా, అంతా తానే అయి కుమారి 21 ఎఫ్ సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించటంతో ఇదే వేరే దర్శకుడు తీశాడన్న ఆలోచన కూడా రాదు. మరోసారి ఎలాంటి కథాబలం లేకుండా కేవలం క్యారెక్టర్స్ తోనే కథ నడిపించే ప్రయత్నం చేశాడు సుకుమార్. చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలిచే ప్రయత్నంలో చాలా సీన్లు బోర్‌గా అనిపించాయి. ముఖ్యంగా ఫస్ట్‌లో చాలా సన్నివేశాలు ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవు. గతంలో ఐటమ్ సాంగ్‌లో మాత్రమే గ్లామర్ పాళ్లు పెంచే సుకుమార్, ఈ సారి సినిమా అంతా అందాల ప్రదర్శననే నమ్ముకున్నట్టుగా అనిపించింది.
ప్లస్ పాయింట్స్ :
సుకుమార్ స్క్రిప్ట్
రాజ్ తరుణ్ యాక్టింగ్
హేబా పటేల్ గ్లామర్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్
స్లో నారేషన్
ఓవరాల్ గా 'కుమారి 21ఎఫ్' ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకునే మసాలా ఎంటర్ టైనర్